
అమరావతి , 22 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లోని పులివెందులలో జనసేన కార్యకర్త వీరాంజనేయులు మృతి చెందడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. నామినేషన్ పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వీరాంజనేయులు మరణవార్త తనను ఎంతగానో కలచివేసిందని పేర్కొన్నారు.
ఈ క్లిష్ట సమయంలో వీరాంజనేయులు కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ అండగా నిలుస్తుందని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించే విషయంలో పార్టీ బాధ్యతగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. కార్యకర్త మరణానికి దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ ఘటనకు సంబంధించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. మరణానికి గల కారణాలు, ఘటనకు సంబంధించిన పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి తనకు నివేదిక అందించాలని కోరారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పార్టీ కార్యకర్త మృతిపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్