పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. జబర్దస్త్ నటులు రైజింగ్ రాజు, దొరబాబుకు గాయాలు
పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ టీవీ కామెడీ షో జబర్దస్త్ టీం సభ్యులు రైజింగ్ రాజు, దొరబాబు గాయపడ్డారు.
Accident


పశ్చిమ గోదావరి , 22 నవంబర్ (హి.స.)

పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ టీవీ కామెడీ షో జబర్దస్త్ టీం సభ్యులు రైజింగ్ రాజు, దొరబాబు గాయపడ్డారు. పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.

వివరాల ప్రకారం.. రైజింగ్ రాజు, దొరబాబు కాకినాడ నుంచి భీమవరం వైపు కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారం వద్దకు చేరుకోగానే కారు ప్రమాదానికి గురైంది. విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో కారులో ఉన్నవారికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో జబర్దస్త్ కమెడియన్లు రైజింగ్ రాజు, దొరబాబు గాయపడినట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే స్పందించారు. క్షతగాత్రులకు సహాయం అందించారు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు కలకలం నెలకొంది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. గాయపడిన ఇద్దరి ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande