
అమరావతి , 22 నవంబర్ (హి.స.)
యలహంక ఆస్తి వివాదానికి సంబంధించి వైఎస్ షర్మిలకు బెంగళూరులోని న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. వివాదంలో ఉన్న ఆస్తిలోకి షర్మిల ప్రవేశించకూడదని స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు, అనుచరులు కూడా ఆస్తి పరిసరాల్లోకి వెళ్లకుండా నిషేధం విధించింది. సిలికాన్ బిల్డర్స్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
సదరు ఆస్తి ప్రస్తుతం తమ ఆధీనంలో ఉందని సిలికాన్ బిల్డర్స్ సంస్థ న్యాయస్థానానికి తెలిపింది. అంతేకాకుండా 2027 ఫిబ్రవరి వరకు ఆస్తి తమ లీజులోనే ఉంటుందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన లీజు ఒప్పంద పత్రాలు, అద్దె చెల్లింపుల వివరాలు, విద్యుత్ బిల్లులను కోర్టు పరిశీలించింది. సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం షర్మిల వర్గం ఆస్తిలోకి ప్రవేశించకుండా మధ్యంతర ఆంక్షలు విధించింది.
ఈ ఉత్తర్వులు డిసెంబర్ 19వ తేదీ వరకు అమల్లో ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. ఆస్తిపై హక్కులు, స్వాధీనం విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. కోర్టు తదుపరి విచారణలో వెలువడే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్