
తిరుమల , 22 నవంబర్ (హి.స.)
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేకుండా సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం కలగడానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు తిరుమలకు భక్తుల రాక భారీగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 84,014 మంది భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిపై భక్తులు తమకున్న విశ్వాసాన్ని చాటుకుంటూ పెద్ద సంఖ్యలో తలనీలాలు సమర్పించారు. నిన్న 30,116 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
ఇక శ్రీవారి హుండీకి కూడా భారీగా ఆదాయం సమకూరింది. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఒక్కరోజులోనే రూ.4.28 కోట్ల ఆదాయం లభించింది. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ సిబ్బంది అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. రద్దీ దృష్ట్యా భక్తులు సంయమనం పాటిస్తూ అధికారులకు సహకరించాలని సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్