
పార్వతీపురం , 22 నవంబర్ (హి.స.)
పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు మండలంలో రాత్రివేళ జరిగిన అరెస్టులు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సరిహద్దు ప్రాంతానికి చెందిన ఐదుగురిని ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ విధుల నిర్వహణకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో వారిపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య చాలాకాలంగా వివాదం కొనసాగుతున్న కొఠియా సరిహద్దు గ్రామాల పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి సమయంలో పోలీసులు గ్రామాలకు చేరుకుని ఐదుగురిని అరెస్టు చేయడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. ఎలాంటి పరిస్థితుల్లో అరెస్టులు జరిగాయి? ఏ ఘటనకు సంబంధించి కేసులు నమోదు చేశారు? అనే విషయాలపై గ్రామస్థుల్లో చర్చ జరుగుతోంది.
ఇప్పటికే కొఠియా గ్రామాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతుండగా, తాజాగా వరుస అరెస్టులు చోటుచేసుకోవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసుల చర్యలతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. ఈ అరెస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు, కేసుల నేపథ్యం తెలియాల్సి ఉంది. గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్