
ఢిల్లీ , 07 నవంబర్ (హి.స.)
దేశ రాజధాని ప్రాంతం (ఢిల్లీ-ఎన్సీఆర్) తీవ్రమైన వాయు కాలుష్య సమస్యను ఎదుర్కొంటోంది. గాలి నాణ్యత సూచీ (AQI) తీవ్రమైన శ్రేణికి చేరుకోవడంతో అధికారులు తక్షణ చర్యలు ప్రారంభించారు. వాయు నాణ్యత తీవ్రంగా పడిపోవడంతో 'గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్' (GRAP-3) కింద నిబంధనలను విధించారు.
కాలుష్యాన్ని అదుపు చేసే చర్యల్లో భాగంగా గురుగ్రామ్ మరియు ఢిల్లీలోని ప్రైవేట్ సంస్థలలో 50 శాతం మంది ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' (WFH) ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఆంక్షలను ధిక్కరించిన కొన్ని ప్రముఖ సంస్థలకు నోటీసులు కూడా ఇచ్చారు. నగరం అంతటా నిర్మాణ పనులపై తాత్కాలిక నిషేధం విధించడమే కాకుండా రహదారులపై నీటిని చల్లడం, డస్టింగ్ పనులను ముమ్మరం చేశారు. పొగమంచు, విషపూరితమైన గాలి నివాసితుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుండడంతో గురుగ్రామ్ వ్యాప్తంగా పాఠశాలలకు వేళల్లో మార్పులు లేదా ఆన్లైన్ తరగతుల వైపు వెళ్లాలని సూచించారు. కాలుష్య నివారణ చర్యలను పటిష్టంగా పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi