మరోసారి దాడులకు దిగనున్న అమెరికా.. అణుస్థావరాల రక్షణకు ఇరాన్ మాస్టర్ ప్లాన్
స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్, 19 ఫిబ్రవరి (హి.స.) ఇరాన్-అమెరికా సంబంధాలు మళ్లీ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితికి చేరినట్టు సమాచారం. పలు అంతర్జాతీయ మీడియా రిపోర్టుల ప్రకారం.. ఇరు దేశాల మధ్య చర్చలు విఫలం అయితే అమెరికా ప్రభుత్వం ఇరాన్పై మరోసారి దాడులకు దిగనుం
Iran


స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్, 19 ఫిబ్రవరి (హి.స.)

ఇరాన్-అమెరికా సంబంధాలు మళ్లీ

తీవ్ర ఉద్రిక్తత పరిస్థితికి చేరినట్టు సమాచారం. పలు అంతర్జాతీయ మీడియా రిపోర్టుల ప్రకారం.. ఇరు దేశాల మధ్య చర్చలు విఫలం అయితే అమెరికా ప్రభుత్వం ఇరాన్పై మరోసారి దాడులకు దిగనుందని తెలుస్తోంది. పశ్చిమాసియా దేశాల్లో భారీగా సైనిక బలగాలను మోహరించడం చూస్తుంటే రేపో మాపో ఇరాన్ పై అమెరికా సైనిక చర్యకు పాల్పడటం ఖాయం అనిపిస్తోంది. అయితే తుది నిర్ణయం ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ.. వైట్ హౌస్లో ఉన్నత స్థాయి భద్రతా సమావేశాలు మాత్రం కొనసాగుతున్నాయని సమాచారం. గత జూన్ 2025లో ఇరాన్ పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడుల తర్వాత మరోసారి అంతకు మించి దాడులు జరపబోతున్నట్టు సమాచారం.

మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అమెరికా రెండు ఎయిరాక్రాఫ్ట్ క్యారియర్లు, యుద్ధ నౌకలు, సబ్మెరిన్లు, స్ట్రైక్ ఎయిర్కాఫ్ట్లను సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా రక్షణ చర్యలను వేగవంతం చేసింది. సాటిలైట్ చిత్రాల ప్రకారం.. పర్చిన్, నాటాంజ్, ఇస్ఫహాన్ వంటి కీలక అణు కేంద్రాల వద్ద భూగర్భబంకర్ల రక్షణను బలోపేతం చేస్తోందని తెలుస్తోంది. టన్నెల్ ప్రవేశ ద్వారాలను కాంక్రీట్తో కప్పడం, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అప్గ్రేడ్ చేయడం వంటి పనులు వేగంగా జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కాంక్రీట్ షీల్డింగ్ చేసి మట్టి కప్పిన నిర్మాణాలు కనిపిస్తున్నాయని అమెరికా శాటిలైట్ సెక్యూరిటీ సంస్థ విశ్లేషకులు చెబుతున్నారు.

అలాగే సముద్ర మార్గాల్లో కూడా ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ నౌకాదళం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ప్రాంతంలో నేవీ విన్యాసాలు నిర్వహిస్తోంది. ఈ విన్యాసాలు రష్యాతో కలిసి చేస్తున్నట్లు సమాచారం. అమెరికా ఏకపక్ష సైనిక చర్యలను నిరోధించడానికి ఒక హెచ్చరిక చర్యగా భావిస్తున్నారు. ఇదే సమయంలో అమెరికా - ఇరాన్ ల మధ్య అణు చర్చలు కూడా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అమెరికా జీరో న్యూక్లియర్ ఎన్రెచ్మెంట్ విధానాన్ని కోరుతుండగా, ఇరాన్ తమ అణు కార్యక్రమం చట్టబద్ధమైన హక్కు అని స్పష్టం చేస్తోంది.

కాగా ఇరుదేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం జరిగితే అది ప్రాంతీయ స్థాయిలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తీవ్ర ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉంది. మధ్యప్రాచ్య దేశాల్లో శాంతి, గ్లోబల్ ఎనర్జీ సరఫరా, జియోపాలిటికల్ సమీకరణాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని విశ్లేషణలు సూచిస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande