
మహబూబ్నగర్, 25 ఫిబ్రవరి (హి.స.) మహబూబ్నగర్ జిల్లాలో పార్కుల దుస్థితి పై వస్తున్న పలు ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి వెంటనే స్పందించి మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ రామానుజుల రెడ్డిని పార్కుల పరిస్థితులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక కార్పోరేటర్ గూండా సంతోష్తో కలిసి మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న పార్కును ఆయన తనిఖీ చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్కు చూసి శుభ్రత లేకపోవడం, జిమ్ విభాగాలు విరిగి పడిపోయి ఉండడం, మద్యం సీసాలు, వాటర్ బాటిల్స్ పడి ఉండడాన్ని గమనించి పార్కు నిర్వహకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
అక్కడ ఉన్న సమస్యలను కార్పోరేటర్ సంతోష్ కమీషనర్ దృష్టికి తెచ్చి వెంటనే పరిష్కరించాలని కోరారు. విరిగిపోయిన జిమ్ విభాగాలు వెంటనే మరమ్మత్తులు చేయించాలని, హైమాస్ట్ లైట్లు అన్నీ వెలిగేలా చర్యలు తీసుకోవాలని ఏఈ వసంతను ఆదేశించారు. నిరంతరం పార్కును ఊడుస్తూ శుభ్రంగా ఉంచాలని, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిఘా ఉంచాలని పార్కు నిర్వాహకులను ఆదేశించారు. కమీషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, సిబ్బంది ఉన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు