
నిర్మల్, 25 ఫిబ్రవరి (హి.స.) వాహనదారులకు రక్షణ కవచంగా హెల్మెట్ ( Helmet ) కాపాడుతుందని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల( SP Janaki Sharmila ) అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదాల నివారణపై వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా యువకులతో నిర్వహించిన బైక్ ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని 35 మంది బైకర్లకు ఉచితంగా హెల్మెట్లను అందజేసి మాట్లాడారు.
కొద్ది దూరమే వెళ్తున్నామని అనేక మంది హెల్మెట్లు ధరించడం లేదని, ఈ స్వల్ప నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెస్తోందని పేర్కొన్నారు. రోడ్ల పైన జాగ్రత్తగా వెళ్తున్నా ఒక్కోసారి ఎదుటివారి నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయని, ఇటువంటి పరిస్థితుల్లో హెల్మెట్ ఉన్నట్లయితే ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడవచ్చన్నారు.
రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, అతివేగాన్ని తగ్గించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం వంటి కీలకమైన భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. కూడళ్ల వద్ద రోడ్డు దాటడం, డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ వాడకపోవడం ప్రాణాలను రక్షిస్తుందని ఈ నిబంధనలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు