
అమరావతి, 26 ఫిబ్రవరి (హి.స.)
కూటమి ప్రభుత్వం సూర్యలంకను పర్యాటక క్లస్టర్గా అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే కేంద్రం మంజూరు చేసిన రూ.97.52 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో మూడు ప్రముఖ ఆతిథ్య సంస్థలు ఐదు, మూడు నక్షత్రాల రిసార్టులు, హోటళ్ల నిర్మాణానికి ఏపీటీడీసీతో ఒప్పందం చేసుకుని రూ.వందల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రభుత్వం తక్కువ ధరకు 17 ఎకరాలు లీజుకిచ్చింది. పర్యాటక ప్రాజెక్టులు చేపట్టడానికి పెట్టుబడిదారులు ఉంటున్నా.. కేటాయించటానికి భూములు అందుబాటులో లేవు. వాటి కొరత పర్యాటక ప్రగతికి అడ్డంకిగా మారింది.
సూర్యలంక బీచ్ పర్యాటకులను ఆకర్షిస్తోంది. అయితే ఇక్కడ ప్రభుత్వ భూమి కేవలం 25 ఎకరాలు మాత్రమే ఉంది. ప్రైవేటు పట్టా భూములు సైతం 20 ఎకరాల్లోపే ఉన్నాయి. మిగిలిన వందల ఎకరాలు అటవీ భూములే. సూర్యలంక నుంచి నాలుగు కి.మీ. దూరంలో పొగురు ప్రాంతం ఉంది. ఇక్కడ నల్లమడ వాగు, పేరలి కాలువ, ఉప్పుటేరు సముద్రంలో కలుస్తున్నాయి. బీచ్ వెంబడి రోడ్డు నిర్మించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. రిజర్వు అటవీ భూములు కావటంతో నిర్మాణాలు సాధ్యపడలేదు. సూర్యలంకలో పర్యాటకం అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రిసార్టులు, ఐదు నక్షత్రాల హోటళ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూమిని మూడు సంస్థల ప్రాజెక్టులకు కేటాయించారు. వాహనాల పార్కింగ్కు కేవలం రెండెకరాలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన ఐదెకరాలను మౌలిక వసతుల కల్పనకు అప్పగించారు. కొత్త ప్రాజెక్టుకు కేటాయించడానికి ఎకరా కూడా అందుబాటులో లేదు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ