
హైదరాబాద్, 26 ఫిబ్రవరి (హి.స.)ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ.. అసైన్డ్ భూములను సౌర విద్యుత్ సంస్థలకు లీజుకు ఇచ్చేలా చట్టసవరణ చేశామని.. హరిత ఇంధన సంస్థలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కర్బన ఉద్గారాలు సున్నాకు తీసుకురావటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 10వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 7 లక్షల 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అంచనా వేస్తున్నామన్నారు.
గతంలో ఇలాంటి ప్రాజెక్టులకు అసైన్డ్ భూములు తీసుకోవడం సాధ్యమయ్యేది కాదని, చట్ట సవరణ ద్వారా అసైన్డ్ భూములు లీజుకు ఇచ్చే వెసులుబాటు కలుగుతోందని మంత్రి తెలిపారు. తద్వారా అసైన్డ్ భూముల యజమానులకు అద్దె రూపంలో ఆదాయం వస్తుందన్నారు. రెండేళ్లకు ఒకసారి లీజు మొత్తాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు వివిధ ప్రభుత్వాలు కలిపి 35 లక్షల ఎకరాల భూములను అసైన్డ్ చేశాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అసైన్డ్ భూములు చాలా చోట్ల చేతులు మారాయని.. పేదల నుంచి భూములు తీసుకున్నవారు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. అసలు లబ్ధిదారులకే లీజు డబ్బు అందేలా చూడాలని సూచించారు. కొన్ని చోట్ల అసైన్డ్ భూముల్లో పండ్ల తోటలు సాగు చేస్తున్నారని, అలాంటి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వైసీపీ హయాంలో భూముల ప్రీ-హోల్డ్లో కుంభకోణం జరిగిందని, దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్