
హైదరాబాద్, 26 ఫిబ్రవరి (హి.స.) పోలవరం - నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్లే వృథాగా వరద జలాలను.. ఆయా ప్రాజెక్ట్లకు తరలిస్తామని పేర్కొన్నారు. గోదావరిపై ఎగువ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని, దీనికి తాము అభ్యంతరం చెప్పలేదని ప్రస్తావించారు. రెండు తెలుగు రాష్ట్రాలకూ దీని వల్ల లాభం కలుగుతుందని ఉద్ఘాటించారు. పోలవరం - నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుకి పొరుగు రాష్ట్రం అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.
సాగునీటి రంగంపై శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. 2047 విజన్లో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రధానంగా నీటి భద్రతపైనే దృష్టి సారించిందని సీఎం వ్యాఖ్యానించారు. గోదావరి, కృష్ణా పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహించే బాధ్యత తమ ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు. గోదావరికి అఖండ హారతి, కృష్ణా నదికి పవిత్ర హారతి ఇవ్వడం ద్వారా జలాలను అత్యంత విలువైన వనరుగా భావిస్తున్నామని పేర్కొన్నారు. గోదావరి నది నుంచి సగటున ఏడాదికి 3 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృథాగా పోతున్నాయని వివరించారు.
వంశధార నుంచి పెన్నా వరకూ రాష్ట్రంలో నదులను అనుసంధానిస్తే సమస్యలు పరిష్కారమవుతాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గంగా-కావేరీ అనుసంధానం జరగాలన్నది తన ప్రగాఢమైన ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. గంగా - కావేరి అనుసంధానం సాధ్యాసాధ్యాలపై ఆనాడే చర్చలు జరిగాయని ప్రస్తావించారు. నదులు అనుసంధానం చేసి, తెలుగు తల్లికి జలహారతి ఇచ్చేలా ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. హంద్రీనీవా ద్వారా 738 కిలోమీటర్ల మేర కాలువలను విస్తరించి కుప్పంలో పరమ సముద్రం చెరువు వరకూ నీరిచ్చామని వివరించారు. మడకశిర వరకూ నీళ్లు తీసుకెళ్లి ఆ ప్రాంత దాహార్తిని తీర్చామన్నారు. ఏపీలో కట్టిన ప్రాజెక్టులన్నీ టీడీపీ, కూటమి హయాంలో వచ్చినవేనని తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీ కట్టిన కాటన్ దొరను ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నామని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలోనే రాయలసీమకు తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రినీవా లాంటి ప్రాజెక్టులు చేపట్టినట్లు ప్రస్తావించారు. సాగునీటిపై 2014 నుంచి 2019లో రూ.68 వేల కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. గడిచిన 20 నెలలుగా రూ.20 వేల కోట్ల వరకూ ఖర్చు చేయగలిగామని వివరించారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకూ నీరిచ్చి, శ్రీశైలంలో నీటిని పొదుపు చేసి 100 టీఎంసీలను రాయలసీమకు తరలించామని వెల్లడించారు. అందుకే ఆ ప్రాంతం రతనాల సీమగా మారిందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి మార్కాపురంతో సహా వివిధ ప్రాంతాలకు న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు భరోసా కల్పించారు.
1312 టీఎంసీల నీటిని ఏపీ ప్రాజెక్టుల్లో నిల్వ చేసుకునే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం 793 టీఎంసీల నీటితో రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లూ కళకళలాడుతున్నాయి. మే 15 తేదీన నారుమళ్లకు నీరిచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. 16 లక్షల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ సాగుతో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ ఉంది. నీటి నిర్వహణ నుంచి పొదుపు చేసే వరకూ నీటి వినియోగదారుల సంఘాలకు అప్పగిస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా భూగర్భ జలాల పెంపునకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సగటున 7 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉన్నాయి. భూగర్భజలాలు గణనీయంగా పెరగటంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ మోటార్ల ద్వారా వినియోగం కూడా తగ్గింది. తద్వారా రూ.91 కోట్ల మేర విద్యుత్ కూడా ఆదా ఆయ్యింది. ఏపీలో 50 శాతం గ్రీన్ కవర్ పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఒక్క తిరుమలలోనే 89 శాతం మేర పచ్చదనం ఉంది. గత పాలనలో గుండ్ల కమ్మ గేట్లు కొట్టుకుపోతే గేట్లు పెట్టేందుకు కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. వైసీపీ హయాంలో పోలవరం డయాఫ్రాం వాల్ కొట్టుకుపోతే.. దాన్ని కూడా గుర్తించలేదు. జగన్ హయాంలో చేయని తప్పునకు నన్ను 53 రోజుల పాటు జైల్లో పెట్టారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకూ నీరు ఇవ్వాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నాను. కావేరిపై రెండు రాష్ట్రాలు ఎలా కొట్టుకున్నాయో చూశాం. నీరుంటే ఎలాంటి సమస్యలూ రావు. నీటి భద్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. కొందరు రాజకీయం కోసమే నీటి సమస్యల్ని తీసుకొస్తున్నారు. ఏపీకి ఉండే వాటర్ సెక్యూరిటీ దక్షిణ భారత్లో మరే రాష్ట్రానికీ లేదు. భూమినే జలాశయంగా మార్చి నీటి సంరక్షణ చేయాలని అందరికీ పిలుపునిస్తున్నాను. వ్యవసాయానికి, పరిశ్రమలకు నీరు ఇవ్వడంతో పాటూ ప్రతి ఇంటికీ తాగునీరు ఇస్తే లక్ష్యాన్ని సాధించినట్లే. తెలుగు తల్లికి జలహారతి ఇచ్చేలా ప్రతి ఎకరాకూ నీరిచ్చే ధృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం. రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు బ్లూ ప్రింట్ను కూడా సిద్ధం చేస్తున్నాం’ అని సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్