
ఆదిలాబాద్,26 ఫిబ్రవరి (హి.స.)
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు రాజకీయ అంతరంగం ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో పెను చర్చకు దారితీస్తోంది. కేబినెట్ హోదా ఉన్న పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కినా, ఆయన బాధ్యతలు చేపట్టేందుకు ససేమిరా అనడం గమనార్హం. మంత్రి పదవి తప్ప మరేది వద్దన్న పట్టుదలతో ఉన్న ఆయన, తన సుదీర్ఘ రాజకీయ అనుభవానికి సరైన గుర్తింపు దక్కలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్కు మంత్రి పదవి దక్కడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రేమ్ సాగర్, అధిష్టానం నిర్ణయంపై మౌనంగానే యుద్ధం చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నా మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి తిరుగులేని విజయం అందించిన తనకు న్యాయం జరగలేదని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. పార్టీ కోసం చేసిన కృషిని గుర్తించి కేబినెట్లోకి తీసుకోవాలని ఆయన తన మొండిపట్టుతో హైకమాండ్పై ఒత్తిడిని కొనసాగిస్తున్నారు.
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల
ప్రేమ్ సాగర్ రావు అంతరంగం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన ఆయన, పార్టీ అధికారంలోకి వచ్చాక తొలి దఫాలోనే కేబినెట్ మంత్రి పదవిని ఆశించారు. అయితే, రెండోసారి జరిగిన మంత్రివర్గ విస్తరణలో సైతం ఆయనకు అవకాశం దక్కకపోగా, అదే జిల్లాకు చెందిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి లభించింది. అప్పటి నుంచి ప్రేమ్ సాగర్ రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాదికాలంగా ఆయనకు ఆరోగ్యం కొంత సహకరించనప్పటికీ, మంత్రి పదవి కోసం తన పట్టును ఏమాత్రం సడలించడం లేదు.
కార్పొరేషన్ పదవికి విముఖత...
అధిష్టానం ఆయనను శాంతింపజేసే క్రమంలో కేబినెట్ హోదాతో కూడిన రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కేటాయించింది. సాధారణంగా ఈ పదవి అత్యంత కీలకమైంది అయినప్పటికీ, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాత్రం బాధ్యతలు చేపట్టడానికి విముఖత చూపుతున్నారు.
మంత్రి పదవితో సమానమైన హోదా దక్కినా ఆయన ఎందుకు ఆసక్తి చూపడం లేదనే అంశం రాష్ట్రస్థాయి నేతలకు సైతం అంతుచిక్కడం లేదు. జిల్లా అధ్యక్ష పదవి దక్కితేనే సంతృప్తి చెందే నేతలు ఉన్నా తరుణంలో, ఇంతటి కీలక పదవిని కాదనుకోవడం వెనుక ఆయన మంత్రి పదవిపై ఉన్న బలమైన ఆకాంక్షే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
సేవల గుర్తింపు కోసం పోరాటం...
ప్రేమ్ సాగర్ రావు వర్గీయుల ప్రకారం, పార్టీకి ఆయన చేసిన సేవలకు ప్రతిఫలంగా మంత్రి పదవి దక్కాల్సిందే. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ తన పరపతితో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, లక్షెట్టిపేట మున్సిపాలిటీలను ఒంటి చేతితో గెలిపించి పార్టీ సత్తా చాటారు. చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో గడ్డం సోదరులు వివేక్, వినోద్లు ఆశించిన ఫలితాలు సాధించలేదని, అయినప్పటికీ తనకు అన్యాయం జరిగిందని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన రాజకీయ లక్ష్యం కేవలం మంత్రి పదవేనని, అందుకే కార్పొరేషన్ పదవిపై అయిష్టత చూపుతూ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు