
వరంగల్, 26 ఫిబ్రవరి (హి.స.)
దేశవ్యాప్తంగా మిర్చికి డిమాండ్
ఉన్నా ధర పెరగడం లేదు. ఈ యేడు విస్తీర్ణం, దిగుబడి తగ్గడంతో ధర పెరుగుతుందని రైతులు ఆశించినా వ్యాపారులు సిండికేట్ కావడంతో ధర పెరగడం లేదు. మార్కెట్లో వ్యాపారులు కొంత మంది రైతులకే ధర పెట్టి మెజార్టీ రైతుల సరుకు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఈ యేడు వర్షాలతో కొంత పంట దెబ్బతినగా ఉన్న పంటకు ధర ఎక్కువగా వస్తుందని ఆశించిన వారికి నిరాశే మిగులుతోంది.
ఉమ్మడి జిల్లాలో ఈయేడు మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. భారీ వర్షాలతో పంట దెబ్బతింది. ఉమ్మడి జిల్లా పరిధిలో లక్షన్నర ఎకరాల్లోపే పంట సాగుచేశారు. వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్ల జిల్లాల పరిధిలో ఎక్కువ విస్తీర్ణంలో మిర్చి సాగు చేయగా, హన్మకొండ, జనగామ జిల్లాల పరిధిలో తక్కువ విస్తీర్ణంలో ఉంది. ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రతియేడు రెండున్నర లక్షల ఎకరాలకు పైగా సాగు అయ్యేది. గతేడాది భారీ వర్షాలు పడటంతో విస్తీర్ణం తగ్గిపోయింది. ఎకరాకు గతంలో 25 నుంచి 35 క్వింటాళ్ల వచ్చే మిర్చి రకాలు ప్రస్తుతం 15 నుంచి 30 క్వింటాల్లోపే వస్తుంది. ఎకరాకు లక్ష నుంచి రెండు లక్షల వరకు రైతులు పెట్టుబడి పెట్టినా ధర రాక ఇబ్బందులు పడుతున్నారు.
డిమాండ్ పెరిగినా ధర లేదు..
ఈయేడు మిర్చికి గతేడాదితో పోలిస్తే డిమాండ్ ఉండడంతో ధర పెంచారు. రకాలను బట్టి గతేడాది కంటే క్వింటాలుకు రూ.3వేల నుంచి రూ.10 వేల మధ్య పెరిగింది. మిర్చి బాగా పండే మధ్యప్రదేశ్, తమిళనాడు, ఏపీ, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో ఈసారి విస్తీర్ణం తగ్గింది. దేశవ్యాప్తంగా వ్యాపారులు కూడా కొనుగోలుకు ముందుకొస్తున్నారు. తెలంగాణలో ముఖ్యంగా వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో కొనుగోలు చేస్తున్నారు. వరంగల్ మార్కెట్ లో వండర్ హాట్ రకం క్వింటాలు రూ.38వేల వరకు ధర పలుకుతుంది. గడిచిన నెలన్నర రోజులుగా సరుకు మార్కెట్ కు వస్తుంది. మొదట భారీగా ధర పెంచిన వ్యాపారులు గడిచిన 15 రోజులుగా ఒకేరకమైన ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు. కొద్దిమంది రైతులకు క్వింటాలు ధర అధికంగా ఇచ్చి మిగతా రైతులకు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. వరంగల్ మార్కెట్ లో ఇప్పటి వరకు అన్ని రకాల మిర్చి కలిసి లక్షా 90 వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. మార్కెట్ కు అత్యధికంగా తేజా రకం వస్తుంది. ఈ రకం మిర్చినే ఉమ్మడి జిల్లాలో 70 శాతం పైగా రైతులు సాగు చేశారు. దీనికి ధర సరాసరి క్వింటాలు రూ.13వేల నుంచి రూ.18,500ల మధ్య పలుకుతుంది. సగటున క్వింటాలు రూ.15వేల నుంచి రూ.16వేల మధ్య కొనుగోలు చేస్తున్నారు. వండర్ హాట్ రకానికి క్వింటాలు రూ.15 వేల నుంచి రూ.37 వేల మధ్య కొనుగోలు చేస్తున్నారు. దీపిక రకం రూ.20వేల నుంచి రూ.30వేల మధ్యన కొంటున్నారు. సింగిల్ పట్టీ రకం క్వింటాలు రూ.30 వేల నుంచి రూ.35 వేల మధ్య కొనుగోలు చేస్తున్నారు. తేజా ఏసీ రకాన్ని రూ.13 వేల నుంచి రూ.15,500ల మధ్యన కొంటున్నారు ఎల్లోరకం మిర్చి క్వింటాలు రూ.22 వేల నుంచి రూ.26 వేల మధ్య కొనుగోలు చేస్తున్నారు.
వ్యాపారుల సిండికేట్..
వరంగల్ మార్కెట్ లో మొదట భారీ ధరలు పెట్టి కొనుగోలు చేసిన వ్యాపారులు 15రోజుల నుంచి ధర పెంచడం లేదు. వ్యాపారులు కొన్ని రకాలకు ఎక్కువ ధర పెట్టి మిగతా మిర్చిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులంతా సిండికేట్ గా మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. మార్కెట్ కు ప్రతీరోజు 20వేల వరకు మిర్చి బస్తాలు వస్తున్నా ధర మాత్రం పెరగడం లేదు. ఇతర రాష్ట్రాల్లో భారీ డిమాండ్ ఉండడంతో ఇక్కడి నుంచి కొనుగోలు చేసి రాష్ట్రానికి పంపిస్తున్నారు. అక్కడ అధిక ధరలకు అమ్ముకుంటున్న వ్యాపారులు రైతులకు మాత్రం ధర పెట్టడం లేదు. వరంగల్ మార్కెట్ కు వచ్చే మిర్చికి అధిక ధర వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈయేడు అత్యధికంగా ధర వస్తుందన్నారు. రైతులకు నష్టం జరుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు