
హైదరాబాద్, 26 ఫిబ్రవరి (హి.స.)
8వ తరగతి పాఠ్యాంశంలో
న్యాయవ్యవస్థలో అవినీతి అంశాన్ని ప్రచురించడాన్ని పట్ల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలను సహించమని, చట్టం తన పని తాను చేసుకుపోతోందని ధర్మాసనం పేర్కొంది. ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. వివాదాస్పదమైన ఆ అంశాలను పాఠ్య పుస్తకాల నుంచి తొలగించాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)కు ఆదేశాలను జారీ చేసింది. ఈ క్రమంలోనే తప్పును చక్కదిద్దుకునే పనిలో NCERT నిమగ్నమైంది.
తాము ఉపసంహరించుకున్న 8వ తరగతి సోషల్ సైన్స్ పార్ట్ -2 (Social Science Part 2) పాఠ్యపుస్తకాలను తిరిగి సేకరించే పనిలో పడింది. ఇప్పటికే మార్కెట్లోకి వెళ్లి అమ్ముడైన కేవలం 38 పుస్తకాలను వెతికి పట్టుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. విద్యాశాఖ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ విద్యా సంవత్సరం కోసం మొత్తం 2.25 లక్షల 8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకాల్లో న్యాయవ్యవస్థలో అవినీతి అంశాన్ని ముద్రించారు. దీంతో ఆ వెర్షన్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని (Withdraw) నిర్ణయించారు. ముద్రించిన 2,25,000 కాపీలలో 2,24,962 పుస్తకాలు ఇంకా విక్రయించబడలేదు. వాటిని ఇప్పటికే గోదాములకు (Warehouses) తరలించారు. కేవలం 38 పుస్తకాలు మాత్రమే మార్కెట్లో అమ్ముడైనట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఆ 38 మంది కొనుగోలుదారులను గుర్తించి వారి నుంచి ఆ పుస్తకాలను రికవరీ చేసే పనిలో NCERT తలమునకలైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు