
భద్రాద్రి కొత్తగూడెం, 26 ఫిబ్రవరి (హి.స.)
దశాబ్దాలుగా భూమిని నమ్ముకొని
సాగు చేసుకుంటున్న ఆదివాసీ గిరిజనులను భయభ్రాంతులకు గురిచేయడం తగదని, వారిని ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. గురువారం మణుగూరులోని ప్రజా భవన్(ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం)లో బూర్గంపాడు మండల పరిధిలోని మోతే గ్రామ పంచాయతీ చింతకుంట, సారపాక గ్రామ పంచాయతీ శ్రీరాంపురం పాయం ఎస్టీ కాలనీ గ్రామస్థులు ఎమ్మెల్యేను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ పూర్వీకుల కాలం నుంచి పోడు సాగు చేసుకుంటున్నామని, అయితే ప్రతి ఏటా ఫారెస్ట్ అధికారులు వచ్చి భూములు లాక్కుంటామని బెదిరిస్తున్నారని బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
రైతులకు దిశానిర్దేశం...
రైతుల ఫిర్యాదుపై ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. మణుగూరు ఎఫ్డిఓ మక్సుద్, అశ్వాపురం రేంజర్ ఉపేందర్ లను తక్షణమే తన కార్యాలయానికి పిలిపించారు. దశాబ్దాలుగా సాగులో ఉన్న గిరిజనులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అని అధికారులను ప్రశ్నించారు. ఇకపై చింతకుంట, శ్రీరాంపురం పాయం కాలనీ సాగుదారులను వేధించవద్దని కరాఖండిగా ఆదేశించారు. అదే సమయంలో రైతులకు కూడా ఎమ్మెల్యే కీలక సూచనలు చేశారు. గతంలో సాగు చేసుకున్న భూములకు రక్షణ ఉంటుంది కానీ, కొత్తగా అడవులను నరికి సాగు చేస్తామంటే మాత్రం కుదరదు అని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..