
హైదరాబాద్, 26 ఫిబ్రవరి (హి.స.)
తెలంగాణలో రెండు రాజ్యసభ సీట్లు ఏప్రిల్ 9న ఖాళీ కాబోతున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్రడ్డితో పాటు కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీల పదవీకాలం ముగియబోతోంది.
దీంతో ఈ రెండు సీట్ల భర్తీకి నేడు ఈసీ నోటిషికేషన్ జారీ చేయనున్నది. నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచే ప్రారంభం కానుండగా మార్చి 5 వరకు గడువు, 6న నామినేషన్ల పరిశీలన, మార్చి 9న ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నారు. 16వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అయితే రెండు పోస్టులు కూడా సంఖ్యా బలం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకే దక్కనున్నాయి. రెండు సీట్లలో ఒకటి అభిషేక్ సింఘ్వీకి కేటాయించి మరోసారి రాజ్యసభకు పంపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక మిగిలిన సీటు కోసం చాలామంది సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ పెద్దలను కలుస్తుండగా, మరికొందరు సీఎం, టీపీసీసీ చీఫ్ల దగ్గర తమ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిసింది.
సీనియర్ల ప్రయత్నాలు..
సీనియర్ నేత చిన్నారెడ్డి ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను ఢిల్లీలో కలిసి తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరారు. మరో సీనియర్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సైతం రాజ్యసభ సీటుపై సీఎం, టీపీసీసీ అధ్యక్షుడిని కోరనున్నట్లు తెలిపారు. సామాజిక సమీకరణాలు, పార్టీకి సేవ కోణంలో మాజీ ఎంపీ వీహెచ్, జెట్టి కుసుమ కుమార్లు సైతం పదవిని ఆశిస్తున్నారు. ఇటీవల ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అలాగే ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి పేరు కూడా లిస్టులో ఉన్నట్టు తెలిసింది. వీరితోపాటు సీనియర్ నేత జీవన్రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్, ఎస్టీ కోటాలో బెల్లయ్య నాయక్లు సైతం పదవిని ఆశిస్తున్నారు. చివరి నిమిషంలో కొత్త పేర్లు కూడా తెరపైకి రావొచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు