గుడుంబా అడ్డాపై ఖాకీల పంజా.. మత్తు వదిలించిన పోలీసులు
మంచిర్యా, 26 ఫిబ్రవరి (హి.స.) మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని బుయ్యారం గ్రామం గుడుంబా తయారీకి అడ్డగా మారింది. గుడుంబా నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నా, ఇక్కడ అటవీ ప్రాంతాన్ని ఆసరాగా చేసుకుని తయారీ దందా జోరుగా సాగుతోంది. బుధవారం స
Gudumba


మంచిర్యా, 26 ఫిబ్రవరి (హి.స.)

మంచిర్యాల జిల్లా వేమనపల్లి

మండలంలోని బుయ్యారం గ్రామం గుడుంబా తయారీకి అడ్డగా మారింది. గుడుంబా నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నా, ఇక్కడ అటవీ ప్రాంతాన్ని ఆసరాగా చేసుకుని తయారీ దందా జోరుగా సాగుతోంది. బుధవారం సాయంత్రం చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ, నీల్వాయి ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి, చెన్నూర్ ఎక్సైజ్ సీఐ హరి, మంచిర్యాల డీటీఎఫ్ సీఐ సమ్మయ్య, ఎక్సైజ్ ఎస్ఐలు రమణ, శారద నేతృత్వంలో సుమారు 40మంది సిబ్బంది అటవీ ప్రాంతంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో 20కి పైగా తయారీ స్థావరాలను గుర్తించి, సుమారు 5వేల లీటర్లకు పైగా నిల్వ ఉంచిన బెల్లం పానకాన్ని అధికారులు ధ్వంసం చేశారు.

అటవీ ప్రాంతమే తయారీకి అడ్డా..

బుయ్యారం సమీపంలోని అటవీ ప్రాంతం తయారీదారులకు వరంగా మారింది. అక్కడ నీరు, కట్టెలు పుష్కలంగా లభించడంతోపాటు పోలీసులకు చిక్కకుండా భూమిలో డ్రమ్ములను పాతిపెట్టి గుట్టుగా బెల్లం పానకాన్ని నిల్వ చేస్తున్నారు. అమోనియా, జీడిగింజలు వంటి ప్రమాదకర ముడి సరుకులతో అడవిలో యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. గ్రామంలోని సగానికి పైగా కుటుంబాలు దీనిపైనే ఆధారపడి జీవిస్తుండడంతో ఎన్నిసార్లు దాడులు చేసినా తయారీ ఆగడం లేదు. అధికారుల నిరంతర నిఘా ఉన్నప్పటికీ, భౌగోళిక పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని తయారీదారులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు.

దాడుల అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో అధికారులు మాట్లాడారు. గుడుంబా వల్ల ప్రాణాలు పోవడమే కాకుండా కుటుంబాలు సామాజికంగా ఆర్థికంగా, చిన్నాభిన్నమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై ఎవరైనా తయారీ, సరఫరా లేదా అమ్మకాలకు పాల్పడితే వారిపై కఠిన కేసులు నమోదు చేయడంతోపాటు ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని రకాల సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ముడి సరుకుల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి గుడుంబాను పూర్తిగా నిర్మూలించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande