
నాగర్ కర్నూల్, 26 ఫిబ్రవరి (హి.స.)
సాంప్రదాయ సాగుతో సతమతమవుతున్న రైతన్నకు భరోసానిస్తూ, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా జిల్లాలో సరికొత్త సాగు విప్లవం మొదలైంది. అంతర్జాతీయ సంస్థ 'జొమాటో ఆలిండియా', స్థానిక 'కోనేరు' స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా 'ఆగ్రో ఫారెస్ట్రీ' పథకాన్ని నాగర్ కర్నూల్ జిల్లాలోకి ప్రవేశపెట్టాయి. తెలంగాణలోనే తొలిసారిగా నాగర్కర్నూల్ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, అచ్చంపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో పండ్ల తోటలు, విలువైన కలప మొక్కల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి. పంజాబ్, యూపీ వంటి ఐదు రాష్ట్రాల్లో 10 లక్షల మొక్కల పంపిణీతో ఇప్పటికే సక్సెస్ అయిన ఈ నమూనాను, ఇప్పుడు ఇక్కడ అమలు చేస్తున్నారు. కేవలం 5, 10 రూపాయలకే మహాగని, ఎర్రచందనం వంటి విలువైన మొక్కలను అందిస్తూ.. 40 ఏళ్ల దీర్ఘకాలిక లక్ష్యంతో రైతులకు అదనపు ఆదాయం కల్పించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.
దేశంలో పర్యావరణ సమతుల్యతను కాపాడుతూనే, రైతులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు వినూత్న ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో రైతులు దశాబ్దాలుగా ఒకే రకమైన సంప్రదాయ పంటలు సాగు చేయడం వల్ల భూసారం తగ్గిపోయి ఆశించిన దిగుబడి రావడం లేదు. దీనిని గుర్తించిన అచ్చంపేట ప్రాంతపు ప్రముఖ స్వచ్ఛంద సంస్థ 'కోనేరు', గత మూడు దశాబ్దాలుగా రైతుల సంక్షేమం కోసం పని చేస్తోంది. తాజాగా ఈ సంస్థ అంతర్జాతీయ స్థాయి 'జొమాటో ఆలిండియా' సంస్థతో అనుసంధానమై నాగర్కర్నూల్ జిల్లా రైతాంగానికి మేలు చేసేలా సరికొత్త 'ఆగ్రో ఫారెస్ట్రీ' పథకాన్ని ప్రవేశపెట్టింది.
తెలంగాణలో తొలి అడుగు..
వాతావరణ మార్పులను తట్టుకుంటూ రైతన్నలకు దీర్ఘకాలిక లాభాలను చేకూర్చేందుకు ఈ రెండు సంస్థలు సుమారు 40 ఏళ్ల పాటు సహకారం అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నాగర్కర్నూల్ జిల్లాను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. అచ్చంపేట నియోజకవర్గంలోని అచ్చంపేట, ఉప్పునుంతల, బల్మూర్, లింగాల మండలాలతో పాటు తెలకపల్లి మండలాలను ఎంపిక చేసి క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. నీటి వసతి కలిగిన ప్రతి రైతు ఈ పండ్ల తోటలు, కలప మొక్కలను సాగు చేయడం ద్వారా అటు అడవుల విస్తీర్ణాన్ని పెంచుతూనే ఇటు ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని ప్రతినిధులు వివరిస్తున్నారు.
జొమాటో ఆలిండియా సంస్థ ఇప్పటికే ఈ విధానాన్ని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు పంజాబ్ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేసింది. ఆయా రాష్ట్రాల్లో ప్రతి ఐదు వేల మంది రైతులకు సుమారు 10 లక్షల మొక్కలను పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించింది. అదే తరహాలో ఇప్పుడు తెలంగాణలోనూ పండ్ల తోటలు, కలప మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా మామిడి, జామ, నిమ్మ, కొబ్బరి వంటి పండ్ల మొక్కలను కేవలం 10 రూపాయలకే, అలాగే మహాగని, ఎర్రచందనం వంటి ఖరీదైన కలప మొక్కలను కేవలం 5 రూపాయలకే రైతులకు అందజేస్తున్నారు. ఇందుకోసం గత రెండు రోజులుగా గ్రామాల్లో సర్వే పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు