
హైదరాబాద్, 26 ఫిబ్రవరి (హి.స.) తెలంగాణలో కొత్త వాహనాలు
కొనుగోలు చేసే వారికి షాక్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రహదారి భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో కొత్త వాహనాలపై ‘రహదారి భద్రత పన్ను' (Road Safety Cess) విధిస్తూ రవాణా శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త నిబంధన మార్చి 1, 2026 నుంచి అమలులోకి రానుంది. మార్చి 1 నుంచి కొనుగోలు చేసే వాహనాలపై భద్రత పన్ను వసూలు చేసే నిబంధనను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుంది.
కార్లు, ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోలు, ఇతర నాన్-ట్రాన్స్పోర్ట్ వాహనాలపై ఈ పన్ను వర్తించనుంది. వాహన రకాన్ని బట్టి ద్విచక్ర వాహనాలకు రూ.2 వేలు, లైట్ మోటార్ వెహికిల్స్పై రూ.5 వేలు, ఇతర వాహనాలకు 5.10 వేల చొప్పున సెస్ విధించనున్నారు. కార్లు తేలికపాటి వాహనాల పరిధిలోకి రానుండగా.. ఇతర వాహనాల పరిధిలోకి 4 నుంచి 7 సీట్ల సామర్థ్యం ఉన్న ప్రయాణికుల ఆటోలు వస్తాయి. వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ పన్నును తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని రవాణా శాఖ స్పష్టం చేసింది. తాజాగా, రోడ్ సేఫ్టీ సెస్ విధింపు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి సుమారు రూ.270 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు