
హైదరాబాద్, 26 ఫిబ్రవరి (హి.స.)
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ప్రభుత్వం ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం మొత్తం గ్రామాలు, పట్టణాల్లో పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, సాధ్యమైన వాటికి వెంటనే పరిష్కారం చూపాలని భావిస్తున్నారు. అందుకోసం ప్రతి డిపార్ట్మెంట్ వారీగా ఏయే కార్యక్రమాలు చేపట్టవచ్చనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసినట్లు తెలిసింది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 16న మొదలై మార్చి 30న ముగియనున్నాయి. ఆ తర్వాత రెండు, మూడు రోజుల విరామంతో క్షేత్రస్థాయి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఆ కార్యక్రమానికి ఇంకా పేరు నిర్ధారించలేదు కానీ, వరుసగా 90 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రోగ్రామ్ సందర్భంగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సమస్యలను క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. గుర్తించి, తక్కువ నిధులతో పరిష్కారమయ్యే పనులకు వెంటనే నిధులు మంజూరు చేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు