
హైదరాబాద్, 26 ఫిబ్రవరి (హి.స.)
వృద్ధులు, ఒంటరి మహిళలు,
వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు తదితరులకు ఆర్థిక సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 'చేయూత' (Cheyutha) పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని నెరవేర్చేందుకు తొలి విడతగా పింఛన్ మొత్తాన్ని కొంత మేర పెంచి, దశలవారీగా పూర్తి స్థాయి హామీని అమలు చేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, ఒకేసారి కాకుండా ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లపై రూ.500 అదనంగా పెంచాలని ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లుగా సమాచారం.
ప్రభుత్వంపై రూ.2,500 కోట్ల అదనపు భారం..
ఒకవేళ 'చేయూత' పింఛన్లపై రూ.500 పెంచితే.. వృద్ధులు, వితంతువులు, ఇతర వర్గాలు ప్రస్తుతం పొందుతున్న రూ.2,016 పింఛన్ రూ.2,516కి పెరిగే అవకాశం ఉంది. ఇక దివ్యాంగులకు అందుతున్న రూ.4,016 కాస్తా రూ.4,516కి చేరనుంది. పింఛన్ల పెంపు అనేది ప్రస్తుతం సాహసోపేత నిర్ణయం అయినా ప్రభుత్వ ఖజానాపై తీవ్ర ప్రభవం చూపనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం నెలకు సుమారు రూ.950 కోట్లు వెచ్చిస్తోంది. తాజాగా 'చేయూత' పింఛన్లపై కేవలం రూ.500 పెంచడం వల్ల ఏడాదికి దాదాపు రూ.2,500 కోట్ల అదనపు భారం పడుతుందని ఆర్థిక శాఖ లెక్కలు వేసింది. వచ్చే ఎన్నికల నాటికి పింఛన్లను రూ.4 వేల నుంచి రూ.6 వేల స్థాయికి తీసుకెళ్లాలంటే, రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమ రంగానికి ఇచ్చే కేటాయింపులను భారీగా పెంచాల్సి ఉంటుంది. అయితే, పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న పేదలకు రూ.500 పింఛన్ పెంపు ఊరటనిచ్చినా, ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం తన పూర్తి హామీని ఎప్పటిలోగా నెరవేరుస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..