
పార్వతీపురం 27 ఫిబ్రవరి (హి.స.) శుభకార్యానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఓ ఆర్మీ జవాన్ మృతిచెందిన ఘటన గరుగుబిల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామానికి చెందిన డి.చంద్రమౌళి(29) 2017లో ఆర్మీలో చేరారు. రెండేళ్ల క్రితం ఎం.సింగుపురం గ్రామానికి చెందిన సునీతతో వివాహం కాగా.. వీరికి ఏడాది పాప అజ్మిక ఉంది. పంజాబ్లోని ఫరీదాబాద్లో జవాన్గా పనిచేస్తున్న అతను మూడు రోజుల క్రితమే పది రోజుల సెలవు మీద స్వగ్రామానికి వచ్చారు. బుధవారం ద్విచక్ర వాహనంపై శుభకార్యానికి వల్లరిగుడబకు వెళ్లారు.
గురువారం ఉదయం తిరిగి వస్తుండగా గిజబ గ్రామ సమీపంలోని మలుపు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. గరుగుబిల్లి ఎస్సై ఫకృద్ధీన్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం ఆసుపత్రికి తరలించారు. తమకు అండగా నిలుస్తాడనుకున్న కుమారుడు విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు గంగారావు, సత్తెమ్మ గుండెలవిసేలా విలపిస్తున్నారు. భార్య సునీత కన్నీరుమున్నీరవుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ