దక్షిణ అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. 15 మందికి పైగా మృతి
డెల్ నార్టే, 28 ఫిబ్రవరి (హి.స.) దక్షిణ అమెరికాలోని బొలీవియా (Bolivia)లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బొలీవియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన C-130 హెర్క్యులస్ ట్రాన్స్పోర్ట్ ఎయిరాఫ్ట్ (C-130 Hercules Transport Aircraft) శుక్రవారం రాత్రి ఎల్ ఆల్టో అంతర్జా
Aeroplane accident


డెల్ నార్టే, 28 ఫిబ్రవరి (హి.స.)

దక్షిణ అమెరికాలోని బొలీవియా

(Bolivia)లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బొలీవియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన C-130 హెర్క్యులస్ ట్రాన్స్పోర్ట్ ఎయిరాఫ్ట్ (C-130 Hercules Transport Aircraft) శుక్రవారం రాత్రి ఎల్ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిందిలా..

సాంటా క్రజ్ (Santa Cruz) నుంచి బయలుదేరిన ఈ సైనిక విమానం, ఎల్ ఆల్టో విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో రన్వేపై నుంచి జారి పక్కనే ఉన్న రద్దీగా ఉండే కోస్టనెరా అవెన్యూ (Costanera Avenue) లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న పలు వాహనాలను ఢీకొంటూ విమానం బీభత్సం సృష్టించింది. విమానం రెక్కలు విరిగిపోయి, మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.

రోడ్డుపై కరెన్సీ నోట్ల వర్షం..

ఈ ప్రమాదంలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన విమానం బొలీవియా సెంట్రల్ బ్యాంక్ (Central Bank of Bolivia) కు చెందిన కొత్త కరెన్సీ నోట్లను రవాణా చేస్తోంది. విమానం ముక్కలు కావడంతో అందులోని నోట్ల కట్టలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో ప్రమాద తీవ్రతను పక్కనపెట్టి, స్థానికులు నోట్లను ఏరుకోవడానికి ఎగబడ్డారు. రక్షణ చర్యలకు ఆటంకం కలగడంతో, పోలీసులు వాటర్ హోస్లు, టియర్ గ్యాస్ను ఉపయోగించి జనాన్ని చెదరగొట్టాల్సి వచ్చింది.

మృతుల్లో విమాన సిబ్బందితో పాటు రోడ్డుపై ప్రయాణిస్తున్న వారు కూడా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్ డెల్ నార్టేకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం నేపథ్యంలో ఎల్ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. బొలీవియా రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande