
సిద్దిపేట, 01 మార్చి (హి.స.)
సిద్దిపేట అన్నింట్లో ఆదర్శంగా
ఉంది.. పది ఫలితాల్లో ఫస్ట్ రావాలన్నదే తపన అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరా నగర్ ప్రభుత్వ పాఠశాలలో విజయీభవ ప్రేరణ కార్యక్రమంలో పాల్గొని పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతి మంచి మార్కులతో పాసైతేనే మీ రాత మారుతుంది అన్నారు. మంచి మార్కులు సాధిస్తే ఐ ప్యాడ్ గిఫ్ట్ ఇస్తా అన్నారు. రాష్ట్రమంతా వస్తున్న బాసర ట్రిపుల్ ఐటీ సీట్లు ఒక ఎత్తు.. మన సిద్దిపేట స్టూడెంట్స్కు వస్తున్న సీట్లు ఒకెత్తు అన్నారు. ఈ ఏడాది పది ఫలితాలలో సిద్దిపేటకు మొదటి స్థానం తెచ్చి తల్లిదండ్రులకు పేరు తేవాలని అన్నారు. నియోజకవర్గం నుంచి 2875 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయబోతున్నట్లు తెలిపారు. పాఠశాలకు
సొంత ఖర్చులతో ప్రత్యేక తరగతులకు స్నాక్స్ ఏర్పాటు చేయించినట్లు పేర్కొన్నారు. మీ అమ్మ నాన్నలకు టివిలు బంద్ చేయించాలి మంచిగా చదవించాలని ఫోన్ లో సూచించినట్టు వెల్లడించారు. ఇంట్లో ఉండి చదువు కోవడానికి డిజిటల్ కంటెంట్ బుక్స్ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఆత్మవిశ్వాసంతో చదివితే అనుకున్న లక్ష్యాన్ని చేరతారని హితబోధ చేశారు. బాగా చదివి ఆల్ ఇండియా సర్వీస్ లో స్థానం సాధించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు కష్టపడి కాదు ఇష్టపడి చదవాలన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి టాప్ ర్యాంక్ సాధించిన 30 మంది విద్యార్థులకు ఐ ప్యాడ్ గిఫ్ట్ గా ఇస్తానని హరీష్ రావు హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..