‘వెలుగుమట్ల' లో అలముకున్న చీకట్లు..!దిక్కుతోచని స్థితిలో పేదలు
ఖమ్మం, 01 మార్చి (హి.స.) ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇండ్ల కూల్చివేత వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతున్నది. పదేళ్లుగా స్థిర నివాసం ఏర్పరుచుకున్న పేదలపై రాత్రికి రాత్రే బుల్డోజర్లు దూసుకురావడం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది. రాజకీయ పార్ట
Velakku matla


ఖమ్మం, 01 మార్చి (హి.స.)

ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇండ్ల కూల్చివేత వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతున్నది. పదేళ్లుగా స్థిర నివాసం ఏర్పరుచుకున్న పేదలపై రాత్రికి రాత్రే బుల్డోజర్లు దూసుకురావడం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది. రాజకీయ పార్టీల ఎంట్రీతో ఈ వ్యవహారం మరింత హీటెక్కింది. రికార్డుల్లో ఉన్న 62 ఎకరాల భూదాన భూముల్లో ఇప్పటికే 32 ఎకరాలు చేతుల్లో ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా పేదలు నివాసాలనే బుల్డోజర్లతో కూల్చివేయడం పై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు పేదలకు మాయమాటలు చెప్పి.. వారి నుంచి రూ. లక్షలు వసూలు చేసి కోట్లకు పడగలెత్తిన నాయకులమని చెప్పుకుంటూ తిరిగే బడాబాబుల వారిని వదిలేయడం వెనక ఆంతర్యమేమిటో అనే చర్చ జరుగుతున్నది.

ఆచార్య వినోభాబావే భూదాన ఉద్యమ స్ఫూర్తితో 1953లో కాలువ రాజా రామారావు అనే వ్యక్తి ఖమ్మం సమీపంలోని వెలుగుమట్లలో 62.7 ఎకరాలను (సర్వే నెంబర్ 147, 148, 149) ప్రభుత్వానికి దానంగా ఇచ్చారు. కాలక్రమేణా es భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఇందులో ఇప్పటికే 32 ఎకరాల వరకు బడా నాయకుల చేతుల్లో వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన 30 ఎకరాల్లో నాయకులమని చెప్పుకుని తిరిగే వ్యక్తులు 'భూ పంపిణీ' పేరిట నిరుపేదల నుంచి రూ. లక్షలు దండుకొని కోట్లు గడించారు. ప్రస్తుతం అక్కడ దాదాపు 400 మంది పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వేలాది మంది పోలీసులు పహారాలో బుల్డోజర్లు దూసుకువచ్చి ఆ ఇండ్లను కూల్చివేశాయి.

వెలుగుమట్ల భూములకు సమీపంలో భారీ విల్లాలతో కూడిన నిర్మాణాలు, పెద్ద పెద్ద భవంతులు, విలాసవంతమైన వెంచర్లు ఏర్పాటు కావడంతో ఇక్కడి భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వీటికి సమీపంలో పేదల ఇండ్లు ఉండడం కొందరికి కంటగింపు మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. భూదాన యజ్ఞ బోర్డు సూచనల మేరకే కూల్చివేతలు చేపట్టామని అధికారులు చెబుతున్నా.. 32 ఎకరాల పై వాలిన గద్దలను విడిచిపెట్టి.. మరో 30 ఎకరాల్లో పేదలు నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేయడం ఏంటనే చర్చ జరుగుతున్నది. దీని వెనుక భారీ కుట్ర దాగుందన్న టాక్ నడుస్తుంది. రూ. 250 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడామని, ప్రజా అవసరాలకు s భూమిని వినియోగిస్తామని, అర్హులైన పేదలను ఆదుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెబుతున్నారు.అయితే ఇప్పటికే జరిగిన నష్టం పేదల పాలిట శాపంగా మారింది.

భూదాన భూముల్లోని పేదలు నివాసముంటున్న 30 ఎకరాలు పోను.. మిగిలిన 32 ఎకరాలు ఎవరి చేతుల్లో ఉన్నదనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పేదలు నిర్మించుకున్న ఇండ్లపై బుల్డోజర్లతో దూసుకువచ్చిన అధికారులు.. మిగతా 32 ఎకరాల విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారన్న చర్చ జరుగుతున్నది. వెంటనే అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి మిగతా 32 ఎకరాల భూదాన భూమి లెక్కలు తేల్చాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి ప్రభుత్వానికి చెందిన 62 ఎకరాల భూదాన భూమిని కాపాడి పేదలకే పంచాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande