
పెద్దపల్లి, 01 మార్చి (హి.స.)
పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో
అనర్హులైన కొందరు ప్రభుత్వ భూములను కబ్జా చేశారని కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా వారి నుంచి స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో ఇంటింటికి సోలార్ పథకం పై జరిగిన అవగాహన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మారం మండలంలోని నర్సింగాపూర్, ఖిలావనపర్తి, ధర్మారం గ్రామంలో కొందరు భూములను అక్రమంగా ఆక్రమించుకున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి పట్టాలు రద్దు చేయాలని మంత్రి ఆదేశించారు.
ప్రభుత్వ భూములను అర్హులైన పేదలకు అందజేస్తామని తెలిపారు. ధర్మారం మండల కేంద్రంలో క్రీడా మైదానం కొరకు కేటాయించిన స్థలాన్ని 15 రోజుల్లో చదును చేసి క్రికెట్, వాలీబాల్,వాకింగ్ ట్రాక్ కు అనుగుణంగా తీర్చిదిద్దాలని మంత్రి అధికారులకు సూచించారు. రాజకీయంగా జన్మనిచ్చిన ధర్మారం మండలం పై ప్రత్యేక ప్రేమ ఉంటుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.ప్రభుత్వం అందజేస్తున్న సోలార్ పథకాన్ని నంది మేడారం గ్రామస్తులు 100 శాతం ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చోరవతో మేడారం గ్రామం 100శాతం సోలార్ గ్రామంలో ఎంపిక అయిందని మంత్రి వివరించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు