
ములుగు, 01 మార్చి (హి.స.) ములుగు జిల్లా మంగపేట
మండలంలోని మల్లూరు హేమాచల
లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పాటు ములుగు జిల్లాను టెంపుల్ టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు, పినపాక శాసనసభ సభ్యులు పాయం వెంకటేశ్వర్లతో కలిసి హేమాచల లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో, అర్చకులు పూర్ణకుంభం డోలు వాయిద్యాలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... మల్లూరు గుట్టలో స్వయంభుగా వెలసిన హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి కుటుంబ సమేతంగా దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దశాబ్దాల కాలం నుంచి భక్తులు కోరిన కోరికలు తీరుస్తారనే విశ్వాసంతో స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ములుగు జిల్లాలో ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రాలు నెలవై ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మేడారం జాతరను అద్భుతంగా 200 సంవత్సరాల వరకు చెక్కుచెదరకుండా ఉండే విధంగా అభివృద్ధి చేసుకొని, మహా జాతరను విజయవంతం చేసుకోవడం జరిగిందన్నారు. గోదావరి పరివాహక ప్రాంతమైన బాసర నుండి భద్రాచలం వరకు టెంపుల్ టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని, వాటికి సంబంధించిన పనులు కూడా త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని స్పష్టం చేశారు.
మంత్రి సీతక్క కోరిక మేరకు దేవాలయాన్ని అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసి చూపిస్తుందని భక్తుల మనోభావాలను అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పి సుధీర్ రామనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్.మహేందర్ జి, మార్కెట్ కమిటీ చైర్మెన్ రేగ కళ్యాణి, ఈఓ మహేష్, ఆలయ రెనోవేషన్ కమిటీ చైర్మన్ యరంగారి సురేష్, శ్రీ ఉమా చంద్రశేఖర్ స్వామి ఆలయ చైర్మన్ కోలగట్ల నరేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు