
హైదరాబాద్, 01 మార్చి (హి.స.)వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదని టీడీపీ సీనియర్ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. అందుకే ఆయనకు నిద్రపట్టక పిచ్చి కూతలు కూస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. కాకాణి గోవర్ధన్ రెడ్డిది కాకి గోలగా ఆయన అభివర్ణించారు.
ఆదివారం నెల్లూరులో విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలో ఉండగా కాకాణి దోపిడీ చేసిన అక్రమ సంపాదన బయటపెట్టానన్నారు. బండేపల్లి భూములకు సంబంధించి తహశీల్దార్లు నుంచి ఆర్డీవో వరకు నుడాకి అలర్ట్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. అనుచరులు దోపిడీ చేస్తుంటే వాళ్లకి కాకాణి సపోర్ట్ చేశారని మండిపడ్డారు.
మొదటి నుంచి నిరాధార ఆరోపణలు చేయడం కాకాణికి పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో తహశీల్దార్లు ఎందుకు సస్పెండ్ అయ్యారో అందరికి తెలుసునన్నారు. కాకాణిని నమ్మే పరిస్థితి అయన కుటుంబ సభ్యులకే లేదన్నారు. కాకాణి హయాంలో ఇన్కం ట్యాక్స్ కట్టే పేదోళ్లకు సర్వేపల్లిలో దోచిపెట్టాడని విమర్శించారు. పోరాటాలు చేసి ప్రజల పక్షాన పోరాడిన చరిత్ర తమదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
గతంలో తన మీద కాకాణి చేసిన రూ. వెయ్యి కోట్ల ఆస్తుల ఆరోపణలపై ఎవరో చెబితే చేశానని కౌంటర్ ఫైల్ చేశావంటూ కాకాణికి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు చెబితే ఈ ఆరోపణలు చేస్తున్నారో చెప్పాలంటూ ఈ సందర్భంగా కాకాణి గోవర్థన్ రెడ్డిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి సూటిగా ప్రశ్నించారు.
తప్పులు చేయడం.. ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకు తిరగడం అలవాటై పోయిందంటూ కాకాణికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చురకలంటించారు. మతిభ్రమించిన కాకాణి మాటలకు వైసీపీ నేతలే నవ్విపోతున్నారన్నారు. మరోసారి నిరాధార ఆరోపణలు చేస్తే నిరూపించేంత వరకు ఇంటి ముందు బైఠాయిస్తామంటూ కాకాణికి ఎమ్మెల్యే సోమిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్