
హైదరాబాద్, 01 మార్చి (హి.స.)తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలు, సమస్యల ఎజెండాలను వెంటనే పంపాలని కేంద్రం రెండు రాష్ట్రాలను తాజాగా కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ, ఏపీ జలవనరుల శాఖలకు వేర్వేరుగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లేఖలు రాసింది. అందిన సమాచారం మేరకు...జనవరి 30న దిల్లీలో రెండు రాష్ట్రాల నీటిపారుదల, జలవనరుల శాఖల ముఖ్య అధికారులు, గోదావరి, కృష్ణా బోర్డుల ఛైర్మన్లతో సీడబ్ల్యూసీ జల వివాదాల కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు.. వారంలోగా రెండు రాష్ట్రాలు ఎజెండాలను ఖరారు చేయాల్సి ఉంది. అయినప్పటికీ రాష్ట్రాలు మిన్నకుండి పోయాయి. ‘ఎజెండాలను సిద్ధం చేసుకుని వాటిని పరస్పరం పంపించుకుని చర్చించుకోవాలి. రాష్ట్రాలు ఎజెండాలపై అభిప్రాయాలు పంచుకున్న తరువాత 15 రోజుల్లో కేంద్రానికి అభిప్రాయాలు అందజేయాలి. అనంతరం సీడబ్ల్యూసీ రెండు రాష్ట్రాలతో ఆయా అంశాలపై సమావేశాన్ని నిర్వహిస్తుంది’ అని నాటి సమావేశంలో నిర్ణయించారు. ఈ విషయాన్ని సమావేశ మినిట్స్లోనూ సీడబ్ల్యూసీ పేర్కొంది. నెల రోజులు గడిచినా రెండు రాష్ట్రాలు ఎజెండాలు పంపకపోవడంపై తాజాగా సీడబ్ల్యూసీ స్పందించింది. సమావేశం నాటి నిర్ణయాలను రాష్ట్రాలకు గుర్తు చేస్తూ లేఖ రాసింది. వీలైనంత త్వరగా ఎజెండాలను అందజేయాలని పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్