
అమరావతి, 01 మార్చి (హి.స.)మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ .. ఇజ్రాయెల్-అమెరికా కూటమి మధ్య మొదలైన భీకర పోరు గల్ఫ్ దేశాలను అతలాకుతలం చేస్తోంది. శనివారం ఉదయం ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ విచక్షణారహితంగా దాడులు ప్రారంభించగా, ఇరాన్ కూడా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ పరిణామాల మధ్య విమాన రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. వారిలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
మూతపడ్డ దుబాయ్ ఎయిర్పోర్ట్..
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం యుద్ధం కారణంగా హఠాత్తుగా మూతపడింది. అమెరికా సైనిక స్థావరాలు ఉన్న దేశాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడంతో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పైకి కూడా క్షిపణులు దూసుకొచ్చాయి. అయితే, యూఏఈ సైన్యం వీటిని గాలిలోనే అడ్డుకుని నాశనం చేసింది. భద్రతా కారణ దృష్ట్యా విమాన సర్వీసులను నిలిపివేయడంతో ఎయిర్పోర్ట్ జనంతో కిక్కిరిసిపోయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ