కూకట్పల్లిలో హవాలా డబ్బు కలకలం.. కళ్లల్లో కారం కొట్టి రూ. కోటి కొట్టేసిన దుండగులు
హైదరాబాద్, 17 మార్చి (హి.స.) హైదరాబాద్ నగరంలోని హవాలా డబ్బు కలకలం రేపిన ఘటన కూకట్పల్లి (Kukatpally) పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. దుండగులు సినీ ఫక్కీలో దారి కాచి, బాధితుల కళ్లలో కారం కొట్టి ఏకంగా రూ.కోటి నగదును దోచుకెళ్లారు. పోలీసు
Hawala money


హైదరాబాద్, 17 మార్చి (హి.స.) హైదరాబాద్ నగరంలోని హవాలా డబ్బు కలకలం రేపిన ఘటన కూకట్పల్లి (Kukatpally) పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. దుండగులు సినీ ఫక్కీలో దారి కాచి, బాధితుల కళ్లలో కారం కొట్టి ఏకంగా రూ.కోటి నగదును దోచుకెళ్లారు. పోలీసుల సమాచారం ప్రకారం.. అజాముద్దీన్ (Azamuddin), కుస్రుఫ్ (Kusruf) అనే ఇద్దరు వ్యక్తులు బహదూర్పూర నుంచి జీడిమెట్లకు బైక్పై వెళ్తున్నారు. వీరి వద్ద సుమారు రూ. కోటి నగదు ఉంది. వీరు కూకట్పల్లి ఏసీపీ కార్యాలయ సమీపానికి చేరుకోగానే, అప్పటికే అక్కడ మాటు వేసిన దుండగులు వీరిని అడ్డుకున్నారు. ఒక్కసారిగా బాధితుల కళ్లలో కారం కొట్టి, వారి వద్ద ఉన్న నగదు సంచులతో పరారయ్యారు. బాధితులు మోసుకెళ్తున్న నగదు హవాలా డబ్బుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

దోపిడీకి గురైన అనంతరం అజాముద్దీన్, కుస్రుఫ్ కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఏసీపీ కార్యాలయానికి అత్యంత సమీపంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నగదు తరలిస్తున్న విషయం ముందే తెలిసిన వారే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande