
యాదాద్రి భువనగిరి, 02 మార్చి (హి.స.)
తెలంగాణ గ్రామీణ బ్యాంకులో
దోపిడీయే లక్ష్యంగా చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) మండల పరిధిలోని ఎల్లంబావి (Yellambavi) గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... సోమవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో కొందరు ఆగంతకులు మెయిన్ రోడ్డుపై ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు వెళ్లారు. ముందస్తు పథకం ప్రకారం వారు తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్ సహాయంతో బ్యాంకు ప్రధాన షట్టర్ యొక్క లాక్లను కట్ చేయడం ప్రారంభించారు.
షట్టర్ను తొలగించే క్రమంలో బ్యాంకుకు ఉన్న సెక్యూరిటీ సైరన్ ఒక్కసారిగా మోగింది. దీంతో బ్యాంకు పరిసరాల్లో నివసించే కాలనీవాసులు ఉలిక్కిపడి నిద్రలేచారు. వెంటనే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి జనం పెద్ద ఎత్తున బయటకు రావడంతో దొంగలు అప్రమత్తమయ్యారు. తాము పట్టుబడతామని భయపడిన ఆగంతకులు, అక్కడ నుంచి పరారయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాంకు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దొంగలు షట్టర్ కట్ చేయడానికి ప్రయత్నించిన గుర్తులను గుర్తించారు. అదృష్టవశాత్తూ దొంగలు బ్యాంకు లోపలికి ప్రవేశించలేకపోయారని, నగదు, బంగారం సేఫ్గా ఉన్నాయని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం బ్యాంకులోని సీసీటీవీ కెమెరాల్లో దొంగల కదలికలు ఏమైనా రికార్డయ్యాయా అనే కోణంలో పోలీసులు ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు