
యాదాద్రి భువనగిరి, 02 మార్చి (హి.స.)
యాదాద్రి భువనగిరి జిల్లాలో 'భూ భారతి' పోర్టల్ వేదికగా జరిగిన రిజిస్ట్రేషన్ల కుంభకోణం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ, నకిలీ చలాన్లతో సాగిన ఈ అక్రమ దందాలో క్షేత్రస్థాయి అధికారుల పాత్రపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. జిల్లాలోని 15 మండలాల్లో ఈ అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించిన తహశీల్దార్లు, తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసినప్పటికీ.. అసలు బాధ్యులెవరనే ప్రశ్న ఎదురవుతుంది.
జిల్లా వ్యాప్తంగా సుమారు 1000కి పైగా డాక్యుమెంట్లలో అవకతవకలు జరగగా, ఒక్క రాజపేట మండలంలోనే 342 డాక్యుమెంట్లు నకిలీ చలాన్లతో రిజిస్టర్ కావడం గమనార్హం. కేవలం ఆపరేటర్లు, డాక్యుమెంట్ రైటర్లే ఈ మోసానికి పాల్పడ్డారని అధికారులు చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవని బాధితులు, ప్రజలు ఆరోపిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తహశీల్దార్ పాత్ర అత్యంత కీలకం. సాధారణంగా రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ప్రింట్ అయ్యే డీడ్ పేపర్లపై మార్కెట్ రేట్, చెల్లించాల్సిన ఫీజు వివరాలు స్పష్టంగా ఉంటాయి. ప్రభుత్వానికి ఎంత చెల్లించారు? వాస్తవానికి ఎంత చెల్లించాలి? అనే వివరాలు ఆటోమేటిక్గా తహశీల్దార్ లాగిన్లోకి వస్తాయి. తహశీల్దార్ సంతకం చేసే ప్రదేశానికి సరిగ్గా పైననే చెల్లించిన మొత్తం వివరాలు కనిపిస్తాయి.
ఆపరేటర్లు, డాక్యుమెంట్ రైటర్ల హస్తంపై వెను వెంటనే స్పందించి ఫిర్యాదు చేసిన అధికారులు, సంతకాలు పెట్టిన తహశీల్దార్లపై విచారణకు మాత్రం వెనకాడుతున్నారు. తక్కువ ఫీజు చెల్లించినప్పుడు సిస్టమ్ ఎందుకు అలర్ట్ చేయలేదు? లేదా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు, ఆపరేటర్లను పోలీసులు రిమాండు తరలించినప్పటికీ, తెర వెనుక ఉన్న 'పెద్దల' హస్తంపై స్పష్టత రావాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు