
కామారెడ్డి, 02 మార్చి (హి.స.)
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో
పాటు మరికొన్ని రకాల క్యాన్సర్లను నివారించేందుకు తయారు చేసిన హెచ్ పీవీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఆడపిల్లలకు వరంగా భావించే ఈ వ్యాక్సిన్ను ఇచ్చే కార్యక్రమాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్ లోని అజ్మీర్లో శనివారం ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా ఉన్న 14 నుంచి 15 సంవత్సరాల బాలికలకు ఈ వ్యాక్సిన్ను అందించి వారు భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఈ సందర్భంగా 2 డోస్లు వైద్యుల పర్యవేక్షణలో ఇచ్చేందుకు కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నెల రోజులకు రెండో డోస్ వేయనున్నారు. కాగా ఈ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోని వారు 17 ఏళ్ల తర్వాత మూడు డోసుల వ్యాక్సిన్ ను తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు మేరకు..
గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్ పీవీ వ్యాక్సినేషన్ ను ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో భారత్ క్యాన్సర్ బాధితుల సంఖ్యాపరంగా మూడో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడుతుండగా 15 లక్షల మంది భారతీయులే ఉన్నట్లుగా గుర్తించారు. దేశంలో క్యాన్సర్ వ్యాధిని నివారించే కార్యక్రమంలో భాగంగా మహిళలకు గర్భాశయ క్యాన్సర్లు, ఇతర మరికొన్ని క్యాన్సర్లు రాకుండా చూసేందుకు హెచ్ పీవీ టీకా సత్ఫలితాలనిస్తుందని ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలు నిర్ధారించాయి. ఈ వ్యాక్సిన్ ను బాలికలకు ఉచితంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే జిల్లాలో ఈ కార్యక్రమం జరగనుంది.
జిల్లాలో 12,043 మంది బాలికలు..
జిల్లాలో 14 నుంచి 15 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలు 12,043 మంది ఉన్నారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. వీరందరికి త్వరలోనే వైద్యుల పర్యవేక్షణలో హెచ్ పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్) చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. 6 వేల నుంచి 12 వేల రూపాయల వరకు ధర ఉన్న ఈ వ్యాక్సిన్ ను ప్రభుత్వం పూర్తి ఉచితంగా అందజేయనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..