
హైదరాబాద్, 02 మార్చి (హి.స.) జనగణనలో మొదటి దశ అయిన హౌస్ లిస్టింగ్ ప్రక్రియకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా కేబినెట్లో హౌస్ లిస్టింగ్ తేదీలను ఖరారు చేయడంతో మార్గం సుగమం అయింది. మే 11 నుంచి జూన్ 9 వరకు ఈ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తొలిసారిగా జనాభా గణన జరుగుతుండగా దేశవ్యాప్తంగా పూర్తిగా ఆన్లైన్ విధానంలో యాప్ ద్వారా చేస్తున్నారు. ఇందుకు 88 వేల సిబ్బంది అవసరం అవుతారని అంచనా వేశారు. 2025 డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో 621 గ్రామీణ మండలాలు, 9,983 రెవెన్యూ గ్రామాలు, 134 పట్టణాలు ఉన్నాయని గుర్తించారు. వీటిని ప్రాతిపదికన తీసుకొని జనాభా లెక్కలు చేయనున్నారు. పట్టణాల్లో కంటోన్మెంట్, జీహెచ్ఎంసీ పరిధిలోని సర్కిల్స్ను లెక్కలోకి తీసుకున్నారు. వీటన్నంటికీ కోడ్ కేటాయించి వాటి ద్వారా ఎన్యుమరేటర్లతో సర్వే చేయనున్నారు. ఇందుకు గ్రామస్థాయిలో టీచర్లతో సహా అందుబాటులో ఉన్న అన్ని శాఖల సిబ్బంది, ఉద్యోగులను వినియోగించుకుంటారు. సిబ్బందిని గుర్తించే పనిని జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.
హౌస్ లిస్టింగ్ సర్వేపై జాతీయ స్థాయి శిక్షణ పూర్తి కాగా 66 మంది మాస్టర్ ట్రైనర్లకు మార్చి 5 నుంచి 8వ తేదీ వరకు హైదరాబాద్లో శిక్షణ ఇవ్వబోతున్నారు. త్వరలోనే జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి పూర్తి అవగాహన కల్పించనున్నారు. అలాగే ఫీల్డ్ లెవల్లో 1,220 మంది వివిధ విభాగాల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తంగా ఏప్రిల్ కల్లా శిక్షణలన్నీ పూర్తి చేయనున్నారు. జనాభా లెక్కల్లో రెవెన్యూ గ్రామాన్ని, పట్టణాల్లో వార్డులను ఒక యూనిట్గా తీసుకోనున్నారు. ఒక్కో ఎన్యుమరేటర్కు 800 జనాభా ఉన్న ప్రాంతాన్ని అప్పగించనున్నారు. టెక్నాలజీపై అవగాహన లేనివారిపై ప్రత్యేక దృష్టి పెట్టి శిక్షణ ఇవ్వనున్నారు. కాగా హౌస్ లిస్టింగ్ అనంతరం 2027, ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు జనగణన ప్రక్రియ జరుగనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు