
హైదరాబాద్, 02 మార్చి (హి.స.)
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి అంశం నివురుగప్పిన నిప్పులా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడం పట్ల జీవన్ రెడ్డి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి ఎక్కువ టికెట్లు ఇచ్చారని ఆరోపిస్తూ జీవన్ రెడ్డి తన అనుచరులను రెబల్స్ గా బరిలోకి దింపారు. ఈ క్రమంలో తనకు పార్టీలో తీవ్రమైన అవమానం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి తీరుపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నడిచేందుకు పార్టీ పట్టువిడుపుకు అవకాశం ఇస్తుంది. దీన్ని అలసత్వమో, అచేతనమో అనుకోవద్దు. సరైన సమయంలో సరైన రీతిలో స్పందిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివన్నీ కామనే అన్నారు. తాజాగా ఓ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పొన్నం ఈ వ్యాఖ్యలు చేశారు.
గతంలో దివంగత మాజీ మంత్రి ఎమ్మెస్సార్ తనను పోటీ చేయమని చెప్పారు. ఆ తర్వాత మారిన పరిస్థితుల వల్ల ఆయనే బరిలోకి నిలిచారు. కానీ నేనుపోటీ చేయాలని అప్పటికే నిర్ణయించుకోవడం వల్లే నేను రెబల్ గా పోటీ చేశాను తప్ప ఆయనకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదన్నారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ కు వచ్చి ప్రవీణ్ రెడ్డి టికెట్ గుంచుకున్నారనే ప్రచారంపై స్పందించిన పొన్నం..ప్రవీణ్ రెడ్డి 2019లో ఎంపీగా నా నామినేషన్ కార్యక్రమానికి హాజరై తర్వాత మూడు రోజులకే పార్టీ మారిపోయారన్నారు. 2023లో నాకు సహకరించిన మాట వాస్తవమే అయిన 2024 పార్లమెంట్ ఎన్నికలలో ఆయన ఇంట్లో నుంచి బయటకు రాలేదు. 2014లో ఆయనకు టికెట్ వస్తే మళ్లీ రాలేదని అందువల్ల ఆయనను బలమైన లీడర్ అనే వాదనను వెనక్కి తీసుకోవాలన్నారు. నేను వారిని మోసం చేయడం కాదు వారే నన్ను మోసం చేశారని ఆరోపించారు. ప్రవీణ్ రెడ్డి రాజకీయ భవిష్యత్తో నాకేం సంబంధం? 2019 ఎంపీ ఎన్నికల్లో నా భవిష్యత్ నాశనం చేశారు. దాని గురించి కూడా మాట్లాడాలి కదా అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు