మిల్లర్ల 'దొడ్డిదారి' దందా.. ఒక్కరోజు తనిఖీల్లో రూ.60 కోట్ల స్కామ్ బట్టబయలు
హైదరాబాద్, 02 మార్చి (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో రైస్ మిల్లుల అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి. బియ్యాన్ని దొడ్డిదారిలో బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఏకంగా ఇతర రాష్ట్రాలకు సైతం తరలిస్తున్నారు. ప్రతి సీజన్ విజిలెన్స్ తనిఖీల్లో వందల కోట్ల
Rice Miller fraud


హైదరాబాద్, 02 మార్చి (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో రైస్ మిల్లుల అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి. బియ్యాన్ని దొడ్డిదారిలో బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఏకంగా ఇతర రాష్ట్రాలకు సైతం తరలిస్తున్నారు. ప్రతి సీజన్ విజిలెన్స్ తనిఖీల్లో వందల కోట్ల అక్రమాలు వెలుగు చూస్తున్నా సాదాసీదా కేసులు, జరిమానాలు అక్రమార్కులకు పరిపాటిగా మారాయి. కఠిన చర్యలు లేకపోవడం, మరోవైపు అధికారులు, రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో ఆడిందే ఆట.. పాడిందే పాట.. అన్నట్టుగా సాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. మరికొందరైతే ముందుగానే మేనేజ్ చేసేసి కేసులు కాకుండా చూసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బాధ్యతలు స్వీకరించాక చారు సిన్హా రైస్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులతో ఆకస్మిక దాడులు చేయించారు.

ఒక్కరోజు తనిఖీల్లోనే రూ. 60 కోట్లు..

రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు ఎనిమిది బృందాలతో 9 జిల్లాల్లోని 19 రైస్ మిల్లుల్లో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో 1.90 లక్షల క్వింటాళ్లకు పైగా ధాన్యం పక్కదారి పట్టినట్టుగా తేల్చారు. వీటి విలువ రూ.60 కోట్లకు పైగా ఉంటుందని గుర్తించారు. ముఖ్యంగా నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీస్థాయిలో అక్రమాలు జరిగాయని అధికారులు పేర్కొన్నారు. నారాయణ్పేటేజిల్లాలో రూ.15.91 కోట్ల విలువైన బియ్యం పక్కదారి పట్టినట్టు అధికారులు తేల్చారు. అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రూ.19.73 కోట్లు, సూర్యాపేట జిల్లాలో రూ.19.32 కోట్లు, పెద్దపల్లి జిల్లాలో రూ.11.38 కోట్ల విలువైన బియ్యాన్ని అక్రమ మార్గాల్లో తరలించారు. కేవలం ఒక్క రోజు 9 జిల్లాల్లో తనిఖీలు చేస్తేనే ఇంత పెద్ద మొత్తంలో అక్రమాలు వెలుగు చూస్తే.. రాష్ట్రవ్యాప్తంగా పీడీఎస్ అక్రమ దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande