
హైదరాబాద్, 02 మార్చి (హి.స.) ఇరాన్ VS అమెరికా, ఇజ్రాయెల్
పరస్పర దాడులతో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్.. అరబ్ కంట్రీస్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో దలాల్ స్ట్రీట్ ఒక్కసారిగా కుప్పకూలింది. సెన్సెక్స్ ఏకంగా 2,743 పాయింట్లు పతనమై 78,543.73 కనిష్ట స్థాయికి చేరుకోగా, నిఫ్టీ 519 పాయింట్లు నష్టపోయి 24,659.25 వద్దకు పడిపోయింది. మిడ్ సెషన్ సమయానికి మార్కెట్లు కొంత కోలుకున్నప్పటికీ, సెన్సెక్స్ 1.34% నష్టంతో 80,199 వద్ద కొనసాగింది. ఈ అకస్మాత్తు పతనం వల్ల ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ. 7.8 లక్షల కోట్లు ఆవిరైపోయింది. దీంతో బిఎస్ఇ (BSE) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 455.70 లక్షల కోట్లకు పడిపోయింది.
నష్టపోయిన కీలక షేర్లు-అంతర్జాతీయ ప్రభావం..
మార్కెట్ దిగ్గజాలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్ఎఫ్సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండి (L&T), మహీంద్రా & మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ (SBI) వంటి షేర్లు మార్కెట్ను భారీగా కిందకు లాగాయి. బిఎస్ఇ లో ట్రేడైన 3,765 స్టాక్స్లో కేవలం 596 మాత్రమే లాభపడగా, 3,014 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. దాదాపు 677 స్టాక్స్ తమ 52 వారాల కనిష్ట స్థాయిని తాకాయి. కేవలం భారత్ మాత్రమే కాకుండా ఆసియాలోని దక్షిణ కొరియా, హాంకాంగ్, జపాన్ మార్కెట్లు కూడా 1% నుండి 1.7% వరకు నష్టపోయాయి.
ప్రమాదకరంగా మారిన రంగాలు..
ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషణ ప్రకారం, ఈ యుద్ధం గనుక ఒకటి- రెండు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే నిఫ్టీ 24,500-25,000 స్థాయికి పడిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs), విమానయాన సంస్థలు (ఇండిగో వంటివి), పశ్చిమ ఆసియాలో భారీ ప్రాజెక్టులు ఉన్న ఎల్అండి (L&T), కెఇసి ఇంటర్నేషనల్ వంటి మౌలిక సదుపాయాల కంపెనీలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ముడి చమురు ధరలు బ్యారెల్కు 90-100 డాలర్లకు చేరితే పెయింట్స్, ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది.
పెట్టుబడికి సురక్షితమైన మార్గాలు..
మిడిల్ ఈస్ట్ కంట్రీ పై దాడి నేపథ్యంలో నెలకొన్న ప్రస్తుత అనిశ్చితిలో పెట్టుబడిదారులు సురక్షితంగా ఉండటానికి కొన్ని రంగాలు అనువైనవని విశ్లేషకులు సూచిస్తున్నారు. ముడి చమురు ధరలు పెరగడం వల్ల ప్రయోజనం పొందే ఓఎన్జసీ (ONGC), ఆయిల్ ఇండియా వంటి అప్స్ట్రీమ్ ఎనర్జీ కంపెనీలు, అలాగే రూపాయి విలువ తగ్గడం వల్ల లాభపడే ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ వంటి ఐటి సర్వీసెస్ సంస్థలు సురక్షితమైనవిగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఫార్మాస్యూటికల్స్, తక్కువ వాల్యుయేషన్ ఉన్న ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా మేలైన ఎంపికలని ఎంకే గ్లోబల్ పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు