
హైదరాబాద్, 02 మార్చి (హి.స.) పెన్షనర్ల బకాయిల చెల్లింపుల కోసం నిధులను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదలయ్యే వచ్చే ఏప్రిల్ నుంచి ప్రతి నెల రూ. వెయ్యి కోట్లకు తగ్గకుండా రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలిసింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. es సమయంలో పెన్షనర్ల బకాయిల చెల్లింపుల అంశం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. దీంతో నిధుల కొరత ప్రభుత్వాన్ని వెంటాడుతున్న... పెన్షనర్లకు న్యాయం చేస్తామని, అందుకోసం ప్రతి నెల అదనపు నిధులను రిలీజ్ చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిసింది.
పేరుకుపోతున్న బకాయిలు
పెన్షనర్ల బకాయిలను చెల్లించేందుకు ప్రతి నెల రూ. 700 కోట్లకు తగ్గకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నది. కానీ ప్రతి నెలా సుమారు 400 మంది ఎంప్లాయిస్ రిటైర్ అవుతున్నారు. ఒక్కొక్కరికి సగటున రూ. కోటి వరకు ఇవ్వాల్సి ఉంటున్నది. దీంతో మళ్లీ రూ. 300 కోట్ల వరకు పెండింగ్ పడుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సుమారు రూ.11 వేల కోట్లు పెండింగ్ ఉన్నట్లు తెలిసింది. ఇలాగే కొనసాగితే పెన్షనర్లలో అసంతృప్తి పెరిగిపోవడంతో పాటు బకాయిలను క్లియర్ చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం గుర్తించింది. అందుకోసం ప్రస్తుతం ప్రతి నెల చెల్లిస్తున్న బకాయిల మొత్తాన్ని పెంచడం వల్ల కాస్త ఉపశమనం కలుగుతుందని, అందుకే ప్రతి నెల చెల్లిస్తున్న రూ.700 కోట్లను రూ. 1000 కోట్లకు పెంచాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ప్రతి నెల పాత అప్పులకు కిస్తీలు, వడ్డీలు, ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించడం తప్పనిసరి. అందుకే పెన్షనర్ల బకాయిలను ఒకేసారి క్లియర్ చేయడం సాధ్యం కావడం లేదని ఆర్థిక శాఖ వర్గాలు అంటున్నాయి. కానీ ప్రతి నెల ఇస్తున్న రూ. 700 కోట్లను దశలవారీగా పెంచుకుంటూ వెళ్తే బకాయిలన్నింటినీ క్లియర్ చేయొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 'వచ్చే ఏప్రిల్ నుంచి రూ. వెయ్యి కోట్లు రిలీజ్ చేయాలి. ఆరు నెలల తర్వాత మరో రూ. 300 కోట్లు పెంచాలి. ఆ తర్వాత ప్రతి నెల రూ. 1500 కోట్లు రిలీజ్ చేస్తే 2027 సెప్టెంబరు నాటికి బకాయిలు మొత్తం క్లియర్ చేయొచ్చు' అని ఓ సీనియర్ ఐఏఎస్ వెల్లడించారు. పెన్షనర్లలో నెలకొన్న అసంతృప్తిని గుర్తించిన సర్కారు సాధ్యమైనంత త్వరగా బకాయిలను చెల్లించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు సెక్రెటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..