
టెహ్రాన్, 02 మార్చి (హి.స.)
గల్ఫ్ (Gulf) ప్రాంతంలో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. తన భూభాగంపై ఇరాన్ (Iran) జరిపిన క్షిపణి దాడులకు నిరసనగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని తన రాయబార కార్యాలయాన్ని (Embassy) తక్షణమే మూసివేస్తున్నట్లుగా యూఏఈ ప్రకటించింది. టెహ్రాన్లోని యూఏఈ రాయబారితో పాటు దౌత్య మిషన్లోని సభ్యులందరినీ యూఏఈ ప్రభుత్వం వెనక్కి రప్పించింది. యూఏఈ భూభాగంలోని నివాస ప్రాంతాలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, సేవా సౌకర్యాలే లక్ష్యంగా ఇరాన్ ఘోరమైన క్షిపణి దాడులకు పాల్పడిందని యూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ చర్యలు తమ జాతీయ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడమే కాకుండా, అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి నిబంధనలను బహాటంగా ఉల్లంఘించడమేనని ప్రకటనలో పేర్కొన్నారు.
అదేవిధంగా ఇరాన్ తీరు వల్ల ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి భంగం వాటిల్లుతుందని, ఇది ఇంధన భద్రతను దెబ్బతీస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రమాదకర స్థితిలోకి నెడుతుందని యూఏఈ ఆందోళన వ్యక్తం చేసింది. తమ దేశ భద్రత, సార్వభౌమాధికారానికి ముప్పు కలిగించే విషయం ఏదైనా సహించబోమని యూఏఈ స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV