
హైదరాబాద్, 25 మార్చి (హి.స.)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పెద్ది' బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్లో ప్రమాదానికి గురైనట్లు గత రెండు రోజులు వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అంతేకాకుండా 'పెద్ది' షూటింగ్ను కూడా వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ విషయం గురించి తెలుసుకున్న మెగా అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఈ విషయంపై స్పందించిన ఆయన టీమ్ చరణ్ గారి కంటికి ఏమీ కాలేదని దెబ్బ కంటి పైన (కనుబొమ్మ పక్కన) తగిలింది. దానికి నాలుగు కుట్లు పడ్డాయి. కన్ను మాత్రం చాలా క్షేమంగా ఉంది. ఎవరూ భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. దీంతో కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ఇంతలోనే రామ్ చరణ్ ప్రమాదం జరగడంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ట్విట్టర్ ద్వారా స్పందించడంతో అంతా మళ్లీ అయోమయంలో పడిపోయారు. “రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలి. అగ్రశ్రేణి యువ కథనాయకుడు రామ్ చరణ్ 'పెద్ది' సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడ్డారని తెలిసింది. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని రాసుకొచ్చారు. దీంతో అభిమానుల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది. ఇక ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పటికీ రామ్ చరణ్ మాత్రం షూటింగ్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూట్ చివరి దశకు చేరుకుందట. రెండు పాటలకు సంబంధించిన చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. కాగా.. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు