
ఢిల్లీ, 25 మార్చి (హి.స.)పశ్చిమాసియా యుద్ధానికి విరామం ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినా.. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గలేదు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు నువ్వానేనా అన్నట్లు ఒకదానిపై మరొకటి బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇటు టెహ్రాన్, అటు లెబనాన్పై ఇజ్రాయెల్ దళాలు దాడులు చేస్తుంటే.. నేరుగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై ఇరాన్ మిసైల్స్ పడ్డాయి. ఇదే సమయంలో ఇప్పటి వరకు డిఫెన్సివ్ అప్రోచ్తో ఉన్న యూఏఈ, సౌదీ, బహ్రెయిన్ తదితర దేశాలు.. ఇప్పుడు ఇరాన్పై దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ముగియడం అసాధ్యమని నిపుణులు అంటున్నారు.
పశ్చిమాసియా యుద్ధం మొదలవడానికి ముందు కూడా యూఎస్, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ దాడుల్లో 2 వేల మందికిపైగా మరణాలు సంభవించినట్లు సమాచారం. వీరిలో 1500 మందికిపైగా ఇరాన్లోనే మరణించడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి ఇరాన్తో చర్చలు జరిగినా కూడా.. ఇరాన్ అణు ఆశయాలను నియంత్రించాలని అమెరికా ప్రయత్నిస్తుందని, అలాగే వారి బాలిస్టిక్ మిసైల్స్ ప్రోగ్రాంపై కూడా ఆంక్షలు విధిస్తుందని ఇజ్రాయెల్ అధికారులు అంటున్నారు. యుద్ధం మొదలవడానికి ముందు కూడా యూఎస్ ఇవే ప్రతిపాదనలు చేస్తే ఇరాన్ తిరస్కరించింది. కాబట్టి ఈసారి కూడా ఇరాన్ ఈ డీల్ను తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఇజ్రాయెల్ అంటోంది. ఒకపక్క చర్చలకు యూఎస్ ప్రయత్నాలు చేస్తుండగానే.. ఇరాన్పై యుద్ధం కోసం పశ్చిమాసియాలో 3 వేల మంది సైనికులను డిప్లాయ్ చేసేందుకు పెంటగాన్ సిద్ధమైనట్లు కథనాలు వినిపిస్తున్నాయి.
ఇంధన ప్రాజెక్టులపై దాడులు..
డొనాల్డ్ ట్రంప్ యుద్ధవిరామం ప్రకటించినప్పటికీ.. తమ ఇంధన ప్రాజెక్టులపై దాడులు జరిగినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇస్ఫాహన్లోని గ్యాస్ అడ్మినిస్ట్రేషన్ భవనం, గ్యాస్ ప్రెజర్ రిడక్షన్ సెంటర్పై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో స్థానికంగా నివశించే ప్రజల ఇళ్లు కూడా దెబ్బతిన్నట్లు అధికారులు చెప్తున్నారు. అలాగే ఖోర్రామ్షెహర్లో కూడా పవర్ప్లాంట్తో అనుసంధానించి ఉన్న సహజవాయువు పైప్లైన్ సమీపంలో ఒక మిసైల్ పడినట్లు స్థానిక అధికారులు చెప్పారు. అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV