
ఢిల్లీ, 27 మార్చి (హి.స.)
అమెరికా (America) కరెన్సీ చరిత్రలో అరుదైన పరిణామం చోటుచేసుకోబోతోంది. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ 250వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా, కొత్తగా ముద్రించే అన్ని యూఎస్ డాలర్ నోట్లపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంతకం ఉండబోతోందని అమెరికా ట్రెజరీ విభాగం ప్రకటించింది. సాధారణంగా అమెరికా కరెన్సీ నోట్లపై ‘ట్రెజరర్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్’ (Treasurer of the United States) సంతకం ఉంటుంది. 1861 నుంచి అంటే గత 165 ఏళ్లుగా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే, ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి ట్రెజరర్ సంతకం స్థానంలో నేరుగా దేశాధ్యక్షుడి సంతకాన్ని ముద్రించాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. ఓ సిట్టింగ్ ప్రెసిడెంట్ సంతకం కరెన్సీ నోట్లపై రావడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి.
మొదటగా 100 డాలర్ల నోట్లపై అధ్యక్షుడు ట్రంప్, ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ (Scott Bessent) సంతకాలను ముద్రించనున్నారు. ఈ కొత్త నోట్ల ముద్రణ ఈ ఏడాది జూన్ నెలలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత దశలవారీగా మిగిలిన అన్ని రకాల డాలర్ నోట్లపై కూడా ఈ మార్పులు అమలులోకి రానున్నాయి. అమెరికా సాధించిన ఆర్థిక పురోగతిని, చారిత్రాత్మక విజయాలను గౌరవించుకోవడానికి అధ్యక్షుడి పేరు కరెన్సీపై ఉండటం సరైన పద్ధతి అని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. అదేవిధంగా కరెన్సీ నోట్లతో పాటు జూలై 4న జరగనున్న వేడుకల కోసం ట్రంప్ ముఖచిత్రంతో కూడిన 24 క్యారెట్ల బంగారు స్మారక నాణేన్ని కూడా విడుదల చేయాలని ఫెడరల్ ఆర్ట్స్ కమిషన్ ఇప్పటికే ఆమోదం తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV