
హైదరాబాద్, 28 మార్చి (హి.స.)
నేపాల్ (Nepal) పాలిటిక్స్ లో పెను
సంచలనం నమోదైంది. మాజీ ప్రధాని, సీపీఎన్-యూఎంఎల్ (CPN-UML) అధినేత కేపీ శర్మ ఓలీ (KP Sharma Oli)ని ఇవాళ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్ (Ramesh Lekhak) ను కూడా భద్రతలాలు నేడు అదుపులోకి తీసుకున్నాయి. దేశంలో కొత్తగా ఎన్నికైన యువ ప్రధాని, మాజీ రాపర్ బాలేంద్ర షా బాధ్యతలు చేపట్టిన 24 గంటలలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
అయితే, గతేడాది సెప్టెంబర్లో నేపాల్లో అవినీతికి వ్యతిరేకంగా జరిగిన 'జెన్-జెడ్' (Gen Z) నిరసనల సమయంలో చోటుచేసుకున్న హింసకు సంబంధించి వీరిపై చర్యలు తీసుకున్నారు. ఆ నిరసనల్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో సుమారు 19 మంది యువకులు ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. తాజాగా, ఈ ఘటనపై విచారణ జరిపిన 'గౌరీ బహదూర్ కార్కీ కమిషన్' (Gauri Bahadur Karki Commission), అప్పటి ప్రధాని ఓలీ, హోంమంత్రి రమేష్ లేఖక్లు హింసకు కారకులని తేల్చింది. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేసింది. దీంతో ఇవాళ వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు