
గుంటూరు29 మార్చి (హి.స.)గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కరడుగట్టిన రిమాండ్ ఖైదీ పోలీసుల కళ్లు కప్పి పరారైన ఘటన కలకలం రేపింది. నాలుగు రాష్ట్రాలకు వాంటెడ్ క్రిమినల్గా ఉన్న అతణ్ని కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వదిలేయడంతో తప్పించుకుని పారిపోయాడు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం నాగన్నగూడేనికి చెందిన నిందితుడు భీముడు అజిత్కుమార్ ఓఎల్ఎక్స్లో తనను తాను డీలర్గా పరిచయం చేసుకుని కార్లను విక్రయిస్తానంటూ వినియోగదారులను నమ్మించేవాడు. కొనుగోలుకు ఆసక్తి చూపించిన వారికి ఫోన్ చేసి వాహనం తన బంధువు వద్ద ఉందని చిరునామా చెప్పేవాడు. అక్కడికి వెళ్లిన కొనుగోలుదారుకు కారు నచ్చితే.. డబ్బులు తన ఖాతాకు బదిలీ చేయించుకునేవాడు.
అనంతరం ఫోన్ స్విచాఫ్ చేసేవాడు. ఒంగోలులో గ్రానైట్ వ్యాపారం చేసి అక్కడా మోసాలకు పాల్పడ్డాడు. మరి కొన్ని ఆర్థిక మోసాలూ చేశాడు. మొత్తం అతడిపై 32 కేసులుండగా ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక పోలీసులకు వాంటెడ్ క్రిమినల్గా మారాడు. ఎట్టకేలకు ఇటీవల విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యాడు. ఈ నెల 24న తెనాలి పోలీసులు ఓ కేసుకు సంబంధించి అజిత్కుమార్ను న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో రేపల్లె సబ్జైలుకు తరలించారు. మధుమేహం, ఆయాసం, గుండె సంబంధిత సమస్యతో బాధ పడుతున్న దృష్ట్యా వైద్యుల సిఫార్సు మేరకు 26న గుంటూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అతడి బాధ్యతను ముగ్గురు ఏఆర్ పోలీసులకు అప్పగించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ