
రంపచోడవరం/ దేవీపట్నం,, 29 మార్చి (హి.స.) పెద్దపులి సంచరిస్తున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలవరం జిల్లా రంపచోడవరం సబ్డీఎఫ్వో అనూష, ఇందుకూరు రేంజ్ అధికారి కొండలరావు తెలిపారు. శనివారం పోతవరంలో రామాలయం వద్ద గిరిజనులకు సబ్డీఎఫ్వో అవగాహన కల్పించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెస్క్యూ బృందాలకు పలు సూచనలు చేశారు. పోతవరం సమీపంలో మీటరాయి చెరువు పరిసర అటవీ ప్రాంతాలను ఆమె పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జోడుమావుళ్లు ప్రాంతంలో పులి కదలికలను గుర్తించి మత్తు ఇంజక్షన్తో రెస్క్యూ బృందాలు, డ్రోన్ కెమెరాల సాయంతో పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శుక్రవారం అటవీశాఖ అధికారులు, రెస్క్యూ బృందాలు కొత్తవీధి, బూరుగుబంద పరిసర ప్రాంతాల్లో పులి కదలికలను గుర్తించారు. పట్టుకునేందుకు రాత్రి వరకు వేచి చూసినప్పటికీ ఫలితం లేకపోవడంతో వెనుదిరిగారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ