
ఛత్తీస్గడ్, 29 మార్చి (హి.స.)
నక్సల్ ముక్త్ ఛత్తీస్గఢ్ దాదాపుగా సఫలమైన నేపథ్యంలో బస్తర్ డివిజన్ నుంచి కేంద్ర బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది. డివిజన్ లోని ఏడు జిల్లాల్లో ఒకటైన దంతేవాడ జిల్లా కటేకల్యాణ్ రోడ్డుపై ఏర్పాటు చేసిన జారమ్ సీఆర్పీఎఫ్ కోబ్రా దళాల క్యాంపును నిన్న ఎత్తివేసి ఆ బలగాలను జార్ఖండ్కు తరలించారు. ఏడు జిల్లాల్లో ఇప్పటికే బస్తర్, కొండగావ్ జిల్లాలు పూర్తిగా నక్సల్ ముక్త్ కాగా, దంతేవాడలో ఒకే ఒక్క మావోయిస్టు దాక్కుని ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అబూజ్మాడ్ ప్రాంతం ఉన్న నారాయణపూర్ జిల్లాలో ఇద్దరు, సుక్మాలో ఐదుగురు, బీజాపూర్ జిల్లాలో 11 మంది, అత్యధికంగా కాంకేర్ జిల్లాలో 19 మంది ఉన్నట్లు వివరిస్తున్నారు. అన్ని జిల్లాల్లో కలిపి ప్రస్తుతం 38 మంది మావోయిస్టులు ఉన్నట్లు, వీరిని కూడా లొంగుబాట పట్టించడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా స్థానిక ఆదివాసీ నేత పాపారావు సరెండర్ తర్వాత ఈ 38 మంది కూడా వచ్చే మూడు రోజుల్లో దారికి వస్తారని భావిస్తున్నారు. వీళ్ల లొంగుబాటు జరగ్గానే మిగతా జిల్లాల్లో ఉన్న క్యాంపులను కూడా ఎత్తివేసి జార్ఖండ్కు పంపిస్తారని ఛత్తీస్గడ్ మీడియా వర్గాల భోగట్టా.
ఇలా ఎత్తేసిన క్యాంపుల స్థానంలో ఆదివాసీల సంక్షేమం కోసం పనిచేసే సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర హోం మంత్రి, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ తెలిపారు. ఇక నుంచి భద్రతా వ్యవహారాలను రాష్ట్ర పోలీసు బలగాలు, డీఆర్జీ బలగాలు చూసుకుంటాయని కూడా ఆయన స్పష్టం చేసినట్లు అక్కడి మీడియా
వర్గాలు చెబుతున్నాయి. కాగా, తాజా గణాంకాల ప్రకారం బస్తర్ డివిజన్లోని ఏడు జిల్లాల్లో సుమారు 96% ప్రాంతం ఇప్పుడు నక్సల్ ప్రభావం నుంచి విముక్తి పొందినట్లు భావిస్తున్నారు. కాంకేర్ జిల్లాలో రూపి అలియాస్ రంగబోయిన భాగ్య, బీజాపూర్-తెలంగాణ సరిహద్దుల్లో హేమ్లా బిచ్చా, సోఢీ కేశా దళాలు సంచరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మార్చి 31 గడువు ముగిసిన తర్వాత ఈ గ్రామాలన్నింటినీ ఒకేసారి లేదా కొన్ని కొన్ని గ్రామాల చొప్పున నక్సల్ ముక్త్ ప్రకటించే అవకాశం ఉంది.
కేంద్ర హోం శాఖ వర్గాల సమాచారం ప్రకారం, దేశంలో మావోయిస్టులకు సంబంధించి ఇప్పటికీ 130 నుంచి 150 మధ్య సాయుధ క్యాడర్లు మిగిలి ఉన్నారు. వీరిలో పొలిట్యూరో సభ్యులు గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్ రావు, మిసిర్ బెస్రా అలియాస్ సాగర్, మరికొందరు డివిజన్ స్థాయి నేతలు, కేడర్లు ఉన్నారు. ఈ 130-150 మందిలో 100 మంది వరకూ జార్ఖండ్ రాష్ట్ర అడవుల్లోనే మిసిర్ బెస్రా నేతృత్వంలో పనిచేస్తున్నారని ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీరిని లొంగుబాట పట్టిచేందుకు లేదా అంతమొందించేందుకు బస్తర్ నుంచి బలగాలను పంపుతున్నామని చెబుతున్నాయి. వీటిలో నాలుగు కోబ్రా దళాలు, మిగతా బలగాలు సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీఎఫ్ దళాలు ఉన్నట్లు వివరించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..