
అమరావతి, 29 మార్చి (హి.స.)తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా శ్రేణులు పండుగలా జరుపుకుంటున్నాయి. ఈ సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొన్నారు. పార్టీ భారీ జెండాను ఆవిష్కరించి, వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ఎన్టీ రామారావు విగ్రహానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఇతర ముఖ్య నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన కార్యకర్తలను చంద్రబాబు పేరుపేరునా పలకరించి, వారిలో ఉత్సాహం నింపారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు పాల్గొన్నారు. వేదికపై ఉన్న ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన తర్వాత, పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న సీనియర్ కార్యకర్తలను వేదికపైకి ఆహ్వానించి, వారితో కలిసి ఆశీనులవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కేవలం పార్టీ కార్యాలయంలోనే కాకుండా, రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలోనూ టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. పార్టీ జెండాలు ఎగురవేసి, మిఠాయిలు పంచుతూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. 1982లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ, నేడు 44 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఏపీ పసుపుమయంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV