
హైదరాబాద్, 04 మార్చి (హి.స.)ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ములుగు జిల్లా పరిధిలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్షించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. ములుగు జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యం ఆధారంగా త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. భూసేకరణకు సంబంధించిన అంచనాలు, ప్రతిపాదనలను 15 రోజుల్లో సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
భూసేకరణ పూర్తయ్యాక సీఎం దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించి పనులు ప్రారంభిస్తామని మంత్రులు తెలిపారు. అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక పరిహార చెల్లింపుకు సిద్ధంగా ఉన్నామని.. భూములు కోల్పోయే రైతులకు మంచి ప్యాకేజీ ఇచ్చి అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. స్వయంగా తామే రైతుల వద్దకు వెళ్లి భూసేకరణ ప్రక్రియ చేపడతామని మంత్రులు వెల్లడించారు. గత ప్రభుత్వం భూసేకరణ, పరిహారంపై మొండిగా వ్యవహరించిందని విమర్శించారు. తమ ప్రభుత్వం రైతుల పక్షాన ఉందని, వారికి అమోదయోగ్యమైన ప్యాకేజీ ఇచ్చి భూములు సేకరిస్తామని చెప్పారు.
రామప్ప - లక్నవరం ఇంటర్ లింకింగ్ ప్రాజెక్టుకు అదనపు నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో పనిచేసి ములుగు రైతులకు సాగునీరు అందించాలని మంత్రులు ఆదేశించారు. దేవాదుల ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణపై 15 రోజుల్లో మరోసారి సమావేశం నిర్వహించి ప్రత్యేకంగా చర్చిస్తామని మంత్రులు పేర్కొన్నారు. సమ్మక్క సారాలమ్మ ప్రాజెక్టుపై చత్తీస్గఢ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని, అక్కడ ముంపు బాధితులకు పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. పెండింగ్ పనుల జాప్యంపై కాంట్రాక్టర్లపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఏవైనా ఇబ్బందులుంటే పరిష్కరిస్తామని మంత్రులు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్